RCB Storm Into IPL 2026 Final After Big Win Over GT In Qualifier 1
విధాత క్రీడా విభాగం | మే 26, 2026:
ధర్మశాల వేదికగా నేడు జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేస్తూ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో రజత్ పటీదార్ విధ్వంసం, బౌలింగ్‌లో మూకుమ్మడి దాడితో ఆర్సీబీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
ధర్మశాల: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన చాలెంజర్స్.. క్వాలిఫయర్-1లోనూ అదే దూకుడును కొనసాగిస్తూ గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన ఈ కీలక పోరులో 255 పరుగులు చేసిన బెంగళూరు, గుజరాత్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసి 92 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి నేరుగా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
కుప్పకూలిన గుజరాత్ : 162 పరుగులకే కథ సమాప్తం
గుజరాత్‌పై ఘనవిజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కీలక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో లక్ష్యఛేదన మొదటి ఆరు ఓవర్లలోనే దాదాపుగా ముగిసిపోయింది. బెంగళూరు బౌలర్లు క్రమశిక్షణతో బంతులు వేస్తూ గుజరాత్‌పై ఒత్తిడిని మరింత పెంచారు. పవర్‌ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయిన జీటీ ఆ తర్వాత తిరిగి మ్యాచ్‌లోకి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఓ దశలో 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన గుజరాత్, 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ తెవాతియా(68) చివరి వరుస బ్యాటర్లతో కలిసి చక్కని భాగస్వామ్యాలు నిర్మించినా పరిస్థితి అప్పటికే చేతులు దాటడంతో చివరికి 19.2 ఓవర్లలో 162 పరుగులు చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. తెవాతియాతో కలిపి ముగ్గురే రెండంకెల స్కోరుకు చేరుకోవడం గమనార్హం.
చాలెంజర్స్ జట్టు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టింది. ప్రతి రన్‌ను ఆపేందుకు ఆటగాళ్లు చూపిన చురుకుదనం, బౌలింగ్ మార్పుల్లో కెప్టెన్ పటీదార్ తీసుకున్న నిర్ణయాలు బెంగళూరును మ్యాచ్ మొత్తంలో ముందువరుసలో ఉంచాయి. గుజరాత్ తరఫున ఎక్కడా సరైన భాగస్వామ్యం లేకపోవడంతో భారీ లక్ష్యం దరిదాపులకు కూడా చేరుకోలేకపోయింది.
కెప్టెన్ పటీదార్ తుఫాన్.. ప్లేఆఫ్స్‌లో ఆర్సీబీ రికార్డు స్కోరు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆరంభం నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడింది. విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టి జట్టుకు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటీదార్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 33 బంతుల్లో 93 పరుగులు చేసి గుజరాత్ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. చివరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ ఏకంగా 86 పరుగులు పిండుకోవడం మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచింది.
పటీదార్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 254/5 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ స్కోరుగా నిలిచింది. గుజరాత్ బౌలర్లు ప్రారంభంలోనే ఒత్తిడికి గురికావడంతో బెంగళూరు బ్యాటర్లు ఎలాంటి రిస్క్ లేకుండా బౌండరీల వర్షం కురిపించారు. దానికి తోడు గుజరాత్ ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా ఆర్సీబీ భారీ స్కోరుకు దోహదపడ్డాయి.
ఫైనల్‌కు నేరుగా బెంగళూరు.. గుజరాత్‌కు మరో అవకాశం
ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గత సీజన్‌లోనూ క్వాలిఫయర్-1 గెలిచి ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ తొలిసారి టైటిల్‌ను కూడా గెల్చుకుంది. ఈసారి కూడా అదే మార్గంలో టైటిల్ పోరుకు చేరడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది
మరోవైపు, గుజరాత్ టైటాన్స్‌కు ఇది పెద్ద షాక్. అయితే టాప్-2లో ఉండటంతో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలేఉంది. రేపు జరగబోయే ఎలిమినేటర్ విజేతతో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ పోరాడాల్సి ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. ఇది బెంగళూరు పూర్తి ఆధిపత్యం చూపించిన మ్యాచ్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ బెంగళూరు గుజరాత్‌ను వెనక్కి నెట్టింది. టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఈసారి కూడా కప్‌పై కన్నేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
