Sanju Samson | రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు రూ.12లక్షల ఫైన్‌.. కారణం ఏంటంటే..?

Sanju Samson | రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు రూ.12లక్షల ఫైన్‌.. కారణం ఏంటంటే..?

Sanju Samson | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)2024 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు తొలి ఓటమి ఎదురైది. జైపూర్‌లోని స‌వాయ్ మాన్ సింగ్ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌లో ఓటమి నిరాశకు గురైన కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ షాక్‌ ఇచ్చింది. రూ.12లక్షల జరిమానా విధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా జరిమానా విధించింది. నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్లు పూర్తి చేయ‌డంలో విఫలం కావడంతో ఐపీఎల్‌ నియమావళి ప్రకారం జరిమానా విధించారు. ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్లో ఓవ‌ర్ రేటు నమోదు చేయడం ఇదే తొలిసారి. రెండోసారి పునరావృతమైతే కెప్టెన్‌కు రూ.24లక్షల విధించే అవకాశం ఉంటుంది.

ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 25శాతం.. లేకపోతే రూ.6లక్షల్లో రెండింటిలో ఏది తక్కువ అయితే దాన్ని పరిగణలోకి తీసుకు జరిమానా విధించనున్నారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ ప‌రాగ్ (76 : 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంస‌న్ (68నాటౌట్; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. గుజరాత్‌ బౌర్లలో ఉమేశ్ యాద‌వ్‌, మోహిత్ శ‌ర్మ, ర‌షీద్ ఖాన్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు. ఆ తర్వాత లక్ష్య చేధనలో గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్ ఆఖ‌రి బంతికి ఏడు వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకున్నది. బ్యాట‌ర్లలో శుభ్‌మ‌న్ గిల్ (72; 44 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశ‌త‌కం సాధించాడు. చివరలో ర‌షీద్ ఖాన్ (24నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్‌తో గుజరాత్‌ జట్టుకు విజయాన్ని చేకూర్చాడు.