T20 World Cup 2024 Ind Vs Australia | సగర్వంగా సెమీస్‌లో భారత్
రోహిత్ శర్మ సృష్టించిన పరుగుల సునామీలో ఆస్ట్రేలియా గల్లంతైంది. భారీ స్కోరు వేటలో వెనుకబడిన కంగారూలు ఓటమి పాలయ్యారు. దీంతో వారి సెమీస్ ప్రవేశం అఫ్ఘన్–బంగ్లాల ఫలితంపై ఆధారపడిఉంది. ఘనవిజయంతో సెమీస్‌లో ప్రవేశించిన ఇండియా, ఫైనల్లో బెర్త్ కోసం ఈనెల 27న ఇంగ్లండ్‌తో తలపడనుంది.

టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ(T20 World Cup 2024)లో భాగంగా భారత(India), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య జరిగిన ఆఖరి సూపర్ 8(Super 8) మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించి సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన కంగారూలు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల వీర విహారంతో భారత్ 205 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, ఆసీస్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడ్డా ఫలితం మాత్రం దక్కలేదు. చివరికి 24 పరుగుల తేడాతో పరాజయం పాలై, సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. India won the match against Australia
భారత ఓపెనర్లలో కోహ్లీ(0) యథావిధిగా సున్నాకే అవుటవగా, రోహిత్ శర్మ ఏమాత్రం తడబాటు లేకుండా యధేచ్చగా బ్యాట్ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని మోతెక్కించాడు. 41 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించిన రోహిత్(50 in 19 balls) ఈ టోర్నీలోనే వేగవంతమైన 50(Fastest Fifty in T20 WC 2024)గా రికార్డు స్థాపించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్లో 200 సిక్సర్లు(200 Sixers) బాదిన ఓకే ఒక్కడిగా, ఒకే జట్టుపై అత్యధిక సిక్స్‌లు కొట్టిన మొనగాడిగా రికార్డులు స్థాపించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో రోహిత్ చెలరేగిపోయాడు. 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో మొత్తం 29 పరుగులు పిండుకున్నాడు. స్టార్క్(Mitchell Starc) అంతర్జాతీయ టి20ల్లో ఇదే చెత్త ఓవర్. తర్వాత, సూర్యకుమార్ యాదవ్(31), దూబే(28), పాండ్యా(27) పరుగులు పారించి, భారత్ భారీ స్కోరు చేయడంలో తమవంతు పాత్ర పోషించారు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 205 పరుగులు చేసింది. India 205/8
అనంతరం, భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టిదెబ్బ తగిలింది. ఓపెనర్ వార్నర్ 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత హెడ్‌కు జతకలిసిన కెప్టెన్ మార్ష్(37) ఆటను గాడిలో పెట్టే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా హెడ్(43 బంతుల్లో 76) చెలరేగిపోయి ఆడాడు. కానీ, ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయారు. లక్ష్యం పెద్దదవడం, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి లోనైన కంగారూలు వికెట్లు పారేసుకున్నారు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి ఓటమి పాలైంది(181/7). రేపు జరగబోయే అఫ్ఘనిస్తాన్–బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అఫ్ఘన్లు భారీ విజయం సాధిస్తే ఆసీస్ ఇంటిముఖం పట్టక తప్పదు.