Nitish Reddy : ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి.?

Nitish Reddy : ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి.?

20 ఏళ్ల తెలుగు కుర్రాడు, ఆంధ్రా అబ్బాయి నితీశ్​ కుమార్​ రెడ్డి, మహామహులైన బ్యాటర్స్​ విఫలమైన చోట గట్టిగా నిలబడి ఐపిఎల్​లో తన తొలి అర్థ శతకం కళ్లు చెదిరే రీతీలో సాధించాడు. కేవలం తన నాలుగో ఐపిఎల్​ మ్యాచ్​లోనే జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అసాధారణరీతిలో నిలబెట్టాడు.

విశాఖపట్టణానికి చెందిన ఈ యువ ఆల్​రౌండర్​ 32 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ సాధించి టీమ్​ ఇండియాకు తన రాక గురించి ఘనంగా తెలియజేసాడు. ముఖ్యంగా అరివీర భయంకరంగా బంతులు వేసే కసిగో రబడ బౌలింగ్​లో నితీశ్​ కొట్టిన హుక్​షాట్​కు స్టేడియమంతా షాక్​లో ఉండిపోయింది. పంజాబ్​ బౌలర్ల ధాటికి అభిషేక్​ శర్మ, ట్రావిస్​ హెడ్​, క్లాసెన్​, రాహుల్​ త్రిపాఠి ఔటయి, హైదరాబాద్​ 64 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన వేళ, క్రీజ్​లో అడుగుపెట్టిన నితీశ్​ ఆదిలో ఆచితూచి ఆడాడు.  ఆ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు.

రబడ, హర్​ప్రీత్​బ్రార్​, సామ్​ కరన్​ల బౌలింగ్​ను ఊచకోత కోసాడు. ముఖ్యంగా హర్​ప్రీత్​ ఓవర్​లో రెండు సిక్స్​లు, రెండు ఫోర్లతో 21 పరుగులు పిండుకున్నాడు. అర్థసెంచరీని కూడా సిక్స్​తో అందుకున్న నితీశ్​ 17వ ఓవర్​లో అర్షదీప్​సింగ్​ చేతికి చిక్కాడు. అప్పటికి అతను 37 బంతుల్లో 64 పరుగులు చేసాడు. తను క్రీజ్​లో వచ్చేటప్పటికి సన్​రైజర్స్​ అసలు 150 అయినా చేస్తుందా లేదా? అనే సందేహం నుండి 182 పరుగులు చేసి గట్టి లక్ష్యాన్ని విధించగలిగిందంటే అది నితీశ్​కుమార్​ చలవే.

నితీశ్​కుమార్​ తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్తాన్​ జింక్​ లిమిటెడ్​లో ఉద్యోగి. అయిదేళ్ల వయసులోనే బ్యాట్​ పట్టుకున్న నితీశ్​, హిందుస్తాన్​ జింక్ మైదానంలో ఆడుతున్న సీనియర్ల ఆట చూడటానికి రోజూ వెళ్లేవాడు. అది గమనించిన తండ్రి ముత్యాలరెడ్డి నితీశ్​ను ప్రోత్సహించాడు. ఉదయ్​పూర్​కు బదిలీపై వెళ్లాల్సివచ్చిప్పుడు, అక్కడి క్రికెట్ రాజకీయాలకు భయపడి ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా కొడుకు క్రికెట్​ కెరీర్​కే అంకితమయ్యాడు. అండర్​–12, 14కు ఆడుతున్నప్పుడు మాజీ క్రికెటర్​, సెలెక్టర్​ ఎమెస్కే ప్రసాద్​ దృష్టిలో పడ్డ నితీశ్​ ఆంధ్రా క్రికెట్​ ఆకాడమీకి ఎంపికయ్యాడు. అండర్​–16కు ఆడుతున్నప్పుడు నాగాలాండ్​తో మ్యాచ్​లో 345 బంతుల్లోనే 441 పరుగులు చేసి సంచలనం సృష్టించిన నితీశ్​,  మీడియం పేసర్​గా ఆ టోర్నమెంట్​లో 26 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఐపిఎల్​ 2024 సీజన్​కు 20 లక్షల కనీస ధరకు అమ్ముడుపోయిన నితీశ్​కుమార్​ రెడ్డి రాబోయే రోజుల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్​ ఆడతాడనడంటో ఎలాంటి సందేహం లేదు.