INDW vs ENGW | పోరాడి ఓడిన భారత్ : సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
ఇందోర్‌లో జరిగిన మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ జట్టు తృటిలో ఓడిపోయి, సెమీస్ అవకాశాలను కష్టతరంగా మార్చుకుంది. స్మృతి మందాన, హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడినా, ఇంగ్లండ్ కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
Heartbreak for India as England beat them by 4 runs in Women’s World Cup 2025 thriller at Indore
(విధాత స్పోర్ట్స్ డెస్క్)
ఇందోర్: మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ జట్టు మరోసారి తృటిలో ఓటమి పాలైంది. ఇండోర్‌లో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, భారత్ మాత్రం వరుసగా మూడో పరాజయం చవిచూసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను, కెరీర్‌లో 300వ అంతర్జాతీయ వన్డే ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్ హెదర్ నైట్ (109; 91 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత శతకంతో పటిష్టమైన స్థితికి చేర్చింది. ఆమెతో పాటు ఏమీ జోన్స్ (56; 68 బంతుల్లో 8 ఫోర్లు) కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడింది. 45వ ఓవర్ల వరకూ ఇంగ్లండ్ 249/3గా బలంగా నిలిచి 300కు పైగా పరుగుల వైపు పయనిస్తుండగా, చివరి ఐదు ఓవర్లలో భారత్ బౌలర్లు పుంజుకొని, కేవలం 39 పరుగులకే ఐదు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 288/8 స్కోర్ చేసింది.
భారత్ తరఫున ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ (4/51) అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చగా, తొలి వన్డే ఆడిన యువ బౌలర్ శ్రీ చరణి (2/68) కూడా మెప్పించింది.
మంధన, హర్మన్ ప్రయత్నాలు వృథా
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మంచి ఆరంభం లభించింది. వైస్ కెప్టెన్ స్మృతి మందాన (88; 94 బంతుల్లో 10 ఫోర్లు) మరియు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70; 76 బంతుల్లో 7 ఫోర్లు) చక్కటి భాగస్వామ్యం నిర్మించారు. ఈ జోడీ భారత్ విజయానికి బాటలు వేసినా, మందాన వికెట్ కోల్పోవడం కీలక మలుపుగా మారింది.
తరువాత వచ్చిన దీప్తి శర్మ (50) ఏకాగ్రతతో ఆడి చివరి వరకూ పోరాడినా, ఇంగ్లండ్ బౌలర్లు ఒత్తిడి పెంచడంతో భారత్ 50 ఓవర్లలో 284/6 వద్దే ఆగిపోయింది. చివరి ఓవర్‌లో భారత్‌కు 14 పరుగులు అవసరం ఉండగా, కేవలం 9 పరుగులకే పరిమితమైంది.
ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి చేరగా, భారత్ మాత్రం తదుపరి రెండు మ్యాచ్‌లు — న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై — గెలవాల్సిందే. లేకుంటే సెమీఫైనల్ కల అందని ద్రాక్షగానే మిగులుతుంది.
Women World Cup 2025 | మహిళల వరల్డ్‌కప్ 2025: భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవమేనా?
మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ —
“స్మృతి వికెట్ మా టర్నింగ్ పాయింట్. చివరి ఐదు ఓవర్లలో మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయింది. అయినా జట్టు బాగా ఆడింది, పాజిటివ్‌గా ఉంది. వచ్చే మ్యాచ్‌ల్లో తప్పులు సరిదిద్దుకుంటాం” అన్నారు.

ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ —
“ఇది మాకు పెద్ద విజయం. చివరి ఓవర్ల ఒత్తిడిని తట్టుకుని జట్టు చక్కగా ఆడింది. సెమీఫైనల్ చేరడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.
భారత్ సెమీఫైనల్ ఆశలు — మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాలి
ఇప్పుడు భారత్ జట్టుకు ఒక్క అవకాశమే ఉంది — అక్టోబర్ 23న నవి ముంబయిలో న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్ గెలవడం. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై చివరి లీగ్ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తేనే భారత్ సెమీఫైనల్‌లో చోటు దక్కుతుంది.
ఫామ్‌లో ఉన్న మందాన, హర్మన్‌ప్రీత్ లాంటి స్టార్ బ్యాటర్లు నిలదొక్కుకోవడమే కాకుండా, బౌలర్లు తమ ప్రతాపం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram