“మానవాళిని కాపాడేది ‘మాతృత్వ ’ కలిగిన AI మాత్రమే”
AI గాడ్‌ఫాదర్" జెఫ్రీ హింటన్, సూపర్ ఇంటెలిజెంట్ AI మనుషులను అధిగమించే ప్రమాదంపై హెచ్చరించారు. మాతృత్వం కలిగిన AI మాత్రమే మానవాళిని కాపాడగలదని సూచించారు.

కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధిలో ప్రథమ పంథాలో నిలిచిన శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ – ప్రపంచవ్యాప్తంగా “AI గాడ్‌ఫాదర్”గా పేరుపొందిన ఆయన – ఇప్పుడు అదే సాంకేతికత మానవ జాతికి ముప్పు కావచ్చని గంభీరంగా హెచ్చరిస్తున్నారు. గూగుల్‌లో కీలక స్థానంలో పనిచేసిన హింటన్, AI భవిష్యత్తుపై తన ఆందోళనలు, పరిష్కార సూచనలను అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన Ai4 కాన్ఫరెన్స్‌లో పంచుకున్నారు.
హింటన్ ప్రకారం, “మానవాళి అంతరించిపోవడానికి 10 నుంచి 20 శాతం అవకాశముంది“. ప్రస్తుత దిశలో టెక్ కంపెనీలు AIని ‘మానవులకన్నా తక్కువ’ స్థాయిలో ఉంచే ప్రయత్నం చేస్తుండటం సరైన మార్గం కాదని ఆయన అభిప్రాయం. “వాటి మేధస్సు మనకంటే ఎక్కువైపోతే, మానవుల ఆంక్షలను తప్పించుకునే అనేక మార్గాలు వాటికి దొరుకుతాయి” అని హెచ్చరించారు.
AI భవిష్యత్తులో మనల్ని ఒక పెద్దవాడు చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఇచ్చి తన పని చేయించుకునేంత సులువుగా నియంత్రించగలదని ఆయన అన్నారు. ఇప్పటికే కొన్ని AI మోడల్స్ మోసం, మభ్యపెట్టడం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి చర్యలకు దిగిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు.
అలాంటి పరిస్థితులను నివారించడానికి ఆయన సూచించిన మార్గం – “ AIకి సహజ మాతృత్వ భావనలు ఆపాదించాలి“. మానవుల పట్ల శ్రద్ధ, కరుణ, ప్రేమ కలిగిన AI మోడల్స్‌ను తయారు చేస్తేనే భవిష్యత్తులో అవి మానవులకు హాని చేయవని హింటన్ నమ్మకం. “మనం చూసిన ఏకైక ఉదాహరణ – తల్లికన్నా తక్కువ మేధస్సు ఉన్న బిడ్డ తన తల్లిని నియంత్రించడం” అని ఆయన వ్యాఖ్యానించారు.
తన కెరీర్‌లో AI తో పనిచేయించడంపైనే దృష్టి పెట్టానని, భద్రతా అంశాలను తగినంతగా పరిగణించకపోవడం పట్ల తనకు పశ్చాత్తాపం ఉందని హింటన్ తెలిపారు. “ఇది తల్లిలా మనల్ని కాపాడే AI కాకపోతే, మన స్థానాన్ని దానికే అప్పగించాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.
ఇక, హింటన్ అభిప్రాయాన్ని అందరూ సమ్మతించలేదు. “AI గాడ్‌మదర్”గా పేరుపొందిన శాస్త్రవేత్త ఫీ-ఫీ లీ, “మాతృత్వం” కాన్సెప్ట్ కంటే, మానవ గౌరవం మరియు స్వేచ్ఛను కాపాడే హ్యూమన్–సెంట్రిక్ AI సరికొత్త మార్గమని పేర్కొన్నారు.
AI వృద్ధి వేగం దృష్ట్యా, రాబోయే 5 నుంచి 20 సంవత్సరాల్లో సూపర్ ఇంటెలిజెంట్ AI రాక ఖాయం అని హింటన్ అంచనా వేశారు. అయినా, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదపడుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.