బీజింగ్​ నుండి న్యూయార్క్​కు రెండు గంటలే – చైనా సూపర్​సోనిక్​ విమానం ఘనత

YUNXING | చైనాకు చెందిన ఓ కంపెనీ తయారుచేసిన సూపర్​సోనిక్​ విమానం శబ్దవేగానికి నాలుగు రెట్ల(MACH4) వేగంతో దూసుకెళ్లగలదని ప్రకటించింది. నమూనా విమానం పరీక్షాప్రయాణం కూడా పూర్తి చేసుకుందని తెలిపింది. 2027 కల్లా పూర్తిస్థాయి వాణిజ్య ప్రయాణీకుల విమానాన్ని అందివ్వగలమని ఆ కంపెనీ స్పష్టం చేసింది.

బీజింగ్​ నుండి న్యూయార్క్​కు రెండు గంటలే – చైనా సూపర్​సోనిక్​ విమానం ఘనత

Yunxing supersonic jet | అప్పుడెప్పుడో 1970ల్లో కాంకర్డ్​(Concorde) విమానమొకటి ఉండేది. అది కూడా శబ్దవేగాన్ని దాటి ప్రయాణించేది. దీన్ని బ్రిటిష్​–ఫ్రెంచ్​ దేశాలు కలిసి తయారుచేసాయి. మాక్​ 2.02(MACH 2.02) వేగం (అంటే శబ్దవేగానికి 2.02 రెట్ల వేగం = గంటకు 2,494 కిమీ లేదా 1550 మైళ్లు) వేగంతో ప్రయాణించేది. సన్నగా, పొడుగ్గా, వంగిన ముక్కుతో చూడ్డానికి అందంగా ఉన్నా, దీన్ని తయారుచేయడానికి ఖర్చు తడిసి మోపెడవడం, టేకాఫ్​, ల్యాండింగ్​ సమయాల్లో చెవులు పగిలిపోయే శబ్దం రావడం లాంటి అవలక్షణాలు దీన్ని క్రమంగా దూరం చేసాయి. పులి మీద పుట్రలా 2000 జులైలో ఓ కాంకర్డ్​ విమానం టేకాఫ్​ అవుతున్న సమయంలోనే మంటలు చెలరేగి కూలిపోవడంతో (2000 Concorde Crash) లోపలున్న 109 మంది ప్రయాణీకులు, భూమ్మీద ఉన్న నలుగురు మరణించారు. దాంతో 2003లో ఈ విమానానికి గుడ్​బై చెప్పాల్సివచ్చింది. అన్నట్లు ఈ విమానాలకు భారత్​కు చెందిన ఎయిర్​ ఇండియా(Air India) కూడా ఆర్డర్​ ఇచ్చి, తర్వాత రద్దు చేసుకుంది. దాని తర్వాత ఇప్పుడు చైనా(China) సూపర్​సోనిక్​ విమాన తయారీలో విజయం సాధించనట్లు ప్రకటించింది.

చైనాకు చెందిన స్పేస్​ ట్రాన్స్​పోర్టేషన్​ (Space Transportation) అనే కంపెనీ, తాను శబ్దవేగానికి 4 రెట్లు(మాక్​ 4)MACH4 ఎక్కువ వేగంతో ప్రయాణించే ప్యాసెంజర్​ విమానాన్ని(Passenger Jet) తయారుచేసినట్లు ప్రకటించింది. అంటే గత కాంకర్ద్​ విమాన వేగానికి రెండు రెట్లు ఎక్కువ. 2027లో పూర్తి పరిమాణంతో ప్రయాణీకుల విమానాన్ని ఇవ్వగలమని స్పేస్​ ట్రాన్స్​పోర్టేషన్​ ధీమా వ్యక్తం చేసింది. ఈ విమానంతో బీజింగ్​ నుండి న్యూయార్క్​కు 8 గంటలు పట్టే సాధారణ విమానప్రయాణం, రెండు గంటలకు( 2hours for Beijing to NewYork) తగ్గిపోతుందని తెలిపింది.

 

బీజింగ్​(Beijing)లో ప్రధాన కార్యాలయం ఉన్న స్పేస్​ ట్రాన్స్​పోర్టేషన్, గత వారం తన యున్​జింగ్(Yunxing)​ సూపర్​సోనిక్​ విమానం నమూనా పరీక్షాయాత్ర(Test Flight)ను విజయవంతంగా ముగించిందని ప్రకటించింది. సరికొత్త అంతరిక్ష విమానయాన సాంకేతికత(Aerospace Technology)ను వాడి తయారుచేసిన యున్​జింగ్​ సూపర్​సోనిక్​ జెట్​ విమానం భూమినుండి 20 కిలోమీటర్ల(65,600 అడుగులు) ఎత్తులో (భూవాతావరణం ఎత్తు 100కిమీ. ఆ తర్వాత అంతా అంతరిక్షమే) ప్రయాణించగలదని చెప్పిన కంపెనీ, ఈ విమానం టేకాఫ్​, ల్యాండింగ్​ రెండు నిలువుగానే(Vertical Take-Off and Landing) జరుగుతాయని ఆశ్చర్యపరిచారు. అంటే రాకెట్​ లాగా అన్నమాట.

అంత ఎత్తు, వేగంతో ప్రయాణించేప్పుడు జనించే ఉష్ణం(1000 0C), తగ్గిపోయే వాయు సాంద్రత లాంటి సంక్లిష్ట పరిస్థితులను  తట్టుకునేలా విమానం ఉపరితలాన్ని తయారుచేసి పలుమార్లు పరీక్షించినట్లు కంపెనీ తెలిపింది. నిలువుగా ఎగరడం, దిగడం కూడా వందల సార్లు విజయవంతంగా పరీక్ష పూర్తిచేసుకుందట.

తమ విమానం వాణిజ్య విమానరంగంలో, పెను సంచలనం సృష్టిస్తుందని చెప్పిన కంపెనీ వైస్​ ప్రెసిడెంట్​ షెన్​ హైబిన్​( Shen Haibin), అంతరిక్ష విహారయాత్రను కూడా సులభతరం చేస్తామని నవ్వుతూ అంది. ఇప్పుడు వర్జిన్​ గెలాక్టిక్​( Virgin Galactic) అంతరిక్ష యాత్రకు ఒక్కరికి 4,50,000 డాలర్లు ఖర్చవుతుండగా, తమ యాత్ర ఖర్చు 63,180 డాలర్లు మాత్రమే అని చెప్పింది.

సరే… అంతరిక్షయాత్ర మాట దేవుడెరుగు కానీ, విమాన ప్రయాణ సమయం తగ్గుతుందంటే ఆనందమే కదా.