జార్జియా ఇంటిపై ఉల్కా శకలం… భూమి కంటే పురాతనమని నిర్ధారణ

జార్జియా ఇంటిపై పడిన ఉల్కా శకలం భూమి కంటే పాతదిగా తేలింది… దాని వెనుక ఖగోళ రహస్యం ఏమిటి?

జార్జియా ఇంటిపై ఉల్కా శకలం… భూమి కంటే పురాతనమని నిర్ధారణ

అమెరికా జార్జియా రాష్ట్రంలోని మెక్‌డోనో నగరంలో జూన్ 26న ఒక ఇంటి పైకప్పును చీల్చుకుంటూ పడిన ఉల్కా శకలం, భూమి కంటే పాతదిగా తేలింది. మెక్డోనో ఉల్కా శకలం అని పేరు పెట్టిన ఈ ఖగోళ శిల 456 కోట్ల సంవత్సరాల వయస్సు కలిగి ఉందని, అంటే భూమి కంటే సుమారు 2 కోట్ల ఏళ్లు పెద్దదని జార్జియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

శాస్త్రవేత్తల ప్రకారం, ఈ ఉల్కా శకలం పైకప్పును దాటి HVAC డక్ట్ గుండా నేలపై బలంగా పడినప్పుడు తుపాకీ కాల్పు లాంటి శబ్దం వినిపించింది. దాని ప్రభావంతో ఫ్లోర్‌లో సొట్ట ఏర్పడగా, ఇల్లు యజమానులు ఇప్పటికీ లివింగ్ రూమ్‌లో అంతరిక్ష ధూళిని చూస్తున్నారు.

జార్జియా యూనివర్సిటీకి చెందిన ప్లానెటరీ జియాలజిస్ట్ స్కాట్ హారిస్ తెలిపిన ప్రకారం, ఈ శకలం భూమి వాతావరణంలోకి ప్రవేశించే ముందు మంగళ, గురు గ్రహాల మధ్య ఉన్న ప్రధాన గ్రహశకల వలయంలోని ఒక భారీ ఆస్టరాయిడ్ పగిలిపోవడంతో పుట్టిందని భావిస్తున్నారు. సుమారు 470 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఆ పేలుడే దీని మూలం అని అంచనా.

సంఘటనాస్థలంలో దొరికిన 50 గ్రాముల ఉల్కా శకలంలో 23 గ్రాములను అధ్యయనానికి అందించారు. ‘లో-మెటల్ ఆర్డినరీ కాన్‌డ్రైట్’గా గుర్తించిన ఈ ఉల్కా శకలం వాతావరణంలోకి సెకనుకు ఒక కిలోమీటరు పైగా వేగంతో ప్రవేశించి, శబ్దం కంటే వేగంగా కదిలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. పైకప్పు ఢీకొట్టడం, చిన్న సోనిక్ బూమ్, నేలపై తాకడం – ఈ మూడు శబ్దాలు ఒకేసారి వినిపించాయని హారిస్ వివరించారు.

కొన్ని సాధారణ సందేహాలు‌‌–సమాధానాలు

ప్రశ్న: మెక్డోనో ఉల్కా శకలానికి పేరు ఎలా వచ్చింది?
సమాధానం: జూన్ 26న జార్జియా రాష్ట్రంలోని హెన్రీ కౌంటీ మెక్‌డోనో నగరంలో పడినందుకు, ఆ నగర పేరుతోనే పేరు పెట్టారు.

ప్రశ్న: భూమి వయస్సు ఎంత?
సమాధానం: భూమి వయస్సు సుమారు 4.54 బిలియన్ (454 కోట్లు)సంవత్సరాలు.

ప్రశ్న: మెక్డోనో ఉల్కా శకలం ఎక్కడి నుండి వచ్చింది?
సమాధానం: మంగళ, గురు గ్రహాల మధ్యనున్న ప్రధాన గ్రహశకల వలయం(ఆస్టరాయిడ్ బెల్ట్‌)లోని ఒక పెద్ద గ్రహ శకలం సుమారు 470 మిలియన్ సంవత్సరాల క్రితం ముక్కలుగా విడిపోవడం వల్ల ఈ శకలం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రశ్న: సోనిక్​ బూమ్​ అంటే ఏంటి?

సమాధానం: ఏదైనా వస్తువు ఆకాశం నుండి ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో వచ్చినప్పుడు పుట్టే శబ్దం.

శాస్త్రవేత్తల మాటల్లో, ఈ చిన్న శకలం పెద్ద హాని చేయకపోయినా, ఇలాంటి అధ్యయనాలు భూమి పెద్ద అంతరిక్ష వస్తువుల ప్రభావాన్ని ఎంతవరకు తట్టుకోగలదో అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.