Scince & Technology | చంద్రుడిపై మొక్కల పెంపకం.. తొలిసారి నాసా ప్రయోగం..!

Scince & Technology | చంద్రుడిపై మొక్కల పెంపకం.. తొలిసారి నాసా ప్రయోగం..!

Scince & Technology : జాబిల్లిపై వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు, నీటి జాడలు కనిపెట్టేందుకు ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆర్టెమిస్‌ 3 యాత్ర ద్వారా చంద్రునిపైకి మళ్లీ వ్యోమగాములను పంపే ప్రణాళికను రెడీ చేసుకున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’.. చంద్రుడిపై మొక్కలు పెంచడం అనే మరో పెద్ద సవాల్‌ను కూడా స్వీకరించబోతోంది.

చంద్రుడి ఉపరితలంపై డక్‌వీడ్, క్రెస్, బ్రాసికా (ఆవ) మొక్కలను పెంచేందుకు నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకోసం 2026లో ‘లీఫ్‌’ (లూనార్‌ ఎఫెక్ట్స్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ ఫ్లోరా) ప్రయోగం నిర్వహించబోతోంది. నాసా 2026లో జాబిల్లిపై నిర్వహించతలపెట్టిన మూడు ప్రయోగాల్లో అది కూడా ఒకటిగా ఉంది. చంద్రుని ఉపరితలంపై మొక్కలను పెంచేందుకు నాసా ప్రయత్నించడం ఇదే తొలిసారి అని సైంటిస్టులు వెల్లడించారు.

అంతరిక్షంలోని పరిస్థితులను మొక్కలు ఎలా తట్టుకోగలుగుతాయో తెలుసుకునేందుకు కొలరాడోలోని స్పేస్‌ ల్యాబ్‌ టెక్నాలజీస్‌ సంస్థ ‘లీఫ్‌’ ప్రయోగాన్ని డిజైన్‌ చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములు.. థేల్‌క్రెస్, డక్‌వీడ్‌ లేదా రెడ్‌ అండ్‌ గ్రీన్‌ బ్రాసికా శాంపిళ్లతో కూడిన ‘గ్రోత్‌ చాంబర్స్‌’ను చంద్రుడి ఉపరితలంపై నెలకొల్పుతారు. రెడ్‌ అండ్‌ గ్రీన్‌ బ్రాసికాను ర్యాప్‌సీడ్‌ లేదా విస్కాన్సిన్‌ ఫాస్ట్‌ ప్లాంట్‌ అని కూడా పిలుస్తారు.

కాగా, శాస్త్రవేత్తలు జాబిల్లిపైకి తీసుకెళ్లిన క్యాప్సూళ్లు అధిక రేడియేషన్, సూర్యకాంతి, అంతరిక్ష శూన్యత నుంచి మొక్కలకు రక్షణ కల్పించడంతోపాటు వాటి పెరుగుదలను వ్యోమగాములు పర్యవేక్షించేందుకు వీలు కల్పిస్తాయి.