Underwater Bullet Train | ముంబయి టు దుబాయ్ – సముద్రంలో బుల్లెట్ రైలు
అంతులేని సంపదతో అలరారుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్() ఈ మధ్య సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతూ, అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. బుర్జ్ ఖలీఫా, పామ్ ఐలండ్ లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇప్పుడు మరో సాహస ప్రయోగానికి నాంది పలికింది. అదే ముంబయి నుండి దుబాయికి సముద్రగర్భంలో బుల్లెట్ రైలు మార్గం.

భవిష్యత్తులో ముంబయి నుండి దుబాయి(Mumbai to Dubai)కి వెళ్లే ప్రయాణీకులు విమాన ప్రయాణ(Air Travel)మే కాకుండా మరో ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం లభించబోతోంది. భారత్‌లోని ముంబయి నుండి యుఏఈ(UAE)లోని ఫుజైరా(Fujairah) నగరానికి జలాంతర్గత రైలు మార్గాన్ని(Under Sea Bullet Train) ఆ దేశ నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్(NABL, UAE) ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదిక(Feasibility Report) త్వరలోనే ఇరుదేశాలకు అందజేయనుంది.
దుబాయి(Dubai) సాంకేతికంగా, నిర్మాణ విశేషాలపరంగా పేరెన్నికగన్న కట్టడాలకు ప్రసిద్ధి. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఎడారి రాజ్యాన్ని(Deset Country) అరేబియా సముద్రాన్ని(Arabian Sea) దాటడం ద్వారా భారత వాణిజ్య రాజధాని ముంబయి(Mumbai)కి తన రేపు నగరమైన ఫుజైరా ద్వారా కలపబోతోంది. ఈ ప్రాజెక్టు ఆలోచన 2018లోనే యుఏఈ–ఇండియా కాన్క్లేవ్(UAE – India Conclave) లోనే ప్రతిపాదించినప్పటికి ప్రస్తుతం దీనికి సంబంధించిన సాంకేతిక వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థలను రూపొందించే పనిలో పడ్డారు.
ప్రస్తుతం ముంబయి నుండి దుబాయికి విమానం ద్వారా దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం పడుతోంది. ఈ రైలు మార్గం ద్వారా ఒక గంట సమయాన్ని తగ్గించవచ్చనేది యుఏఈ ఆలోచన. ఎందుకంటే ఆ రైలు వేగం గంటకు 600 నుండి 1000 కిమీ(600 to 1000 kmph) ఉండబోతోంది. అయితే ఈ మార్గం ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు(Mutli purpose Project). కేవలం ప్రయాణీకుల కోసమే కాకుండా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి కూడా ఉపయోగించబోతోంది. అందులో చమురును భారత్‌కు(Oil to India) పంపడం, భారత్ నుండి నర్మదానది మంచినీళ్ల(Fresh water to UAE)ను యుఏఈకి తరలించడం కూడా భాగమే. ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు 1240 మైళ్లు లేదా 2000 కిమీ. కానీ, సముద్రాంతర్భాగంలో సొరంగాన్ని(Tunnel under Sea) నిర్మించడం పెద్ద సవాలు. ఇంకా ఇది మామూలు ఇటుక, సిమెంటులతో కాకుండా ప్రయాణీకులు సముద్రాంతర్గత ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు వీలుగా సొరంగం పారదర్శకం(Transparent)గా ఉండేలా నిర్మించాలని ఆలోచిస్తున్నారు. ఈ సొరంగం ఎలా ఉండాలి? అందులో వాడే రైళ్లు ఎలా ఉండాలి? అనే దానిపై విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. నిర్మాణ సవాళ్లే కాకుండా, ఈ ప్రాజెక్టు అయ్యే ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. కనీసం కొన్ని వేల కోట్ల(Billions of Dollars) డాలర్ల పెట్టుబడి అవసరమవుతుంది. అయితే ఇక్కడ అర్థిక సమస్య పెద్దదేం కాదు గానీ, నిర్మాణ సాంకేతికతే పెను సవాలుగా మారుతుంది. జలాంతర్గత రైలు ప్రయాణమార్గం అనేది కొత్తదేం కాదు. ఇంగ్లండ్–ఫ్రాన్స్(Egnland – France)ల మధ్య నీటిలో సొరంగ రైలు మార్గం 1994లోనే ప్రారంభమైంది. కాగా, ఈ రైలు మార్గం పొడవు కేవలం 56 కిమీ మాత్రమే. అందులో ప్రయాణించే రైలు కూడా నెమ్మదిగా గంటకు వంద కిలోమీటర్ల వేగంతోనే నడుస్తుంది.
ఇప్పటికే నియోమ్(NEOM) అనే బయోసిటీ ప్రాజెక్టును చేపట్టిన దుబాయి, ఇప్పుడు అంతకంటే ప్రతిష్టాత్మకంగా ముంబయి–దుబాయి రైలుమార్గాన్ని నిర్మించాలనుకుంటోంది.
ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ప్రకారం సముద్రాంతర్భాంగంలో రెండు భారీ కాంక్రీట్ సొరంగాలను(Floating tunnels) ఏర్పాటు చేస్తారు. ఈ రెండు అతుక్కునే ఉంటాయి. అలాగే ఈ సొరంగమార్గాన్ని తేలియాడే భారీ స్థంభాల(Pontoons)తో అనుసంధానించి వేలాడదీస్తారు. ఈ స్థంభాల మధ్య దూరం నౌకాప్రయాణానికి వీలుగా ఉండేంత ఉంటుంది. ఒక్కో సొరంగం రెండు భాగాలుగా ఉంటుంది. పై సగంలో రైలుమార్గం ఉండగా, కింది సగంలో నీరు లేదా చమురు పైపు ఉంటుంది. ఇది రెండు కాబట్టి, రెండు రైలు మార్గాలు, రెండు పైపులు ఉంటాయి. ఒక రైలు ప్రయాణీకుల కోసం, మరో రైలు సరకు రవాణా కోసం కాగా, ఒక పైపు ఫుజైరా నుండి చమురు భారత్‌కు రావడానికి, మరో పైపు ముంబయి నుండి మంచినీరు దుబాయ్‌కి వెళ్లడానికి ఉపయోగిస్తారు. దీని ద్వారా మధ్యప్రాచ్య దేశాలు(Middle East Nations), భారత్‌తో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునేందుకు వీలు కలుగుతుంది.
యుఏఈ–ఇండియా కాంక్లేవ్‌లో నేషనల్ అడ్వజరీ బ్యూరో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్(NABL MD), యుఏఈ ఛీఫ్ కన్సల్టెంట్ అబ్దుల్లా అల్షేహి(Abdulla Alshehhi) మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు భారత నగరమైన ముంబయిని, యుఏఈ రేవు నగరమైన ఫుజైరా(Port city of Fujairah)ను అత్యాధునిక–అత్యంత వేగవంతమైన రైలు ద్వారా కలుపుతుంది. ఇందులో యుఏఈ నుండి ఫుజైరా ద్వారా చమురు ఎగుమతి, ముంబై నుండి నర్మద వరద నీటి (Narmada River excess water) దిగుమతి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా, ఇతర జిసిసి(Gulf Cooperation Counsil) దేశాలు కూడా భారత్‌తో పటిష్టమైన వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకోవచ్చని తెలిపారు.