Made in India chip | భారత్‌లో తొలి స్వదేశీ చిప్ – విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్

సెమికాన్ ఇండియా 2025లో ISRO అభివృద్ధి చేసిన విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భారత్ సెమికాన్ మిషన్ ఫలితంగా దేశం వినియోగదారు నుంచి సృష్టికర్తగా మారిన చారిత్రక సందర్భం ఇది.

Made in India chip | భారత్‌లో తొలి స్వదేశీ చిప్ – విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్

Made in India chip | భారత్ దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో వినియోగదారుడిగా మాత్రమే ఉంది. కానీ 2021లో ప్రారంభమైన ఇండియా సెమికండక్టర్ మిషన్ (ISM)తో పరిస్థితి పూర్తిగా మారింది. దేశంలోనే చిప్ డిజైన్, ఫాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ₹76,000 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీ ప్రకటించింది. మూడు-నాలుగేళ్లలోనే గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌ సహా ఆరు రాష్ట్రాల్లో ₹1.60 లక్షల కోట్ల పెట్టుబడులతో పదికి పైగా ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి. ఈ కృషి ఫలితమే తాజాగా ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025లో ప్రధాని మోదీకి సమర్పించబడిన తొలి స్వదేశీ చిప్​ విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్. ఇది భారత్​ఎలక్ట్రానిక్స్​ ప్రస్థానాన్ని మార్చిన చారిత్రక క్షణం.

Prime Minister Narendra Modi receiving Vikram 32-bit Processor, India’s first indigenously manufactured chip, from IT Minister Ashwini Vaishnav

సెమికాన్ ఇండియా 2025లో చారిత్రక ఘట్టం

న్యూఢిల్లీ లో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సభలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి “విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్” – భారత్‌లోనే పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న తొలి మైక్రోప్రాసెసర్ చిప్‌ను అందజేశారు. అదే సమయంలో మరో నాలుగు ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా ప్రధానికి ప్రదర్శించారు.

ISRO శాస్త్రవేత్తల సృష్టి

ISRO సెమికండక్టర్ ల్యాబొరేటరీ (SCL), చండీగఢ్ ఈ చిప్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని విక్రమ్3201 పేరుతో పరిచయం చేశారు. ఇది అత్యంత కఠినమైన స్పేస్ లాంచ్ వాహన పరిస్థితుల్లో కూడా పనిచేయగలదు.

  • 180nm CMOS ఫాబ్రికేషన్‌తో మోహాలీ (పంజాబ్)లో తయారీ, ప్యాకేజింగ్ పూర్తయింది.
  • 2024లో PSLV-C60 మిషన్‌లో విక్రమ్ 3201 విజయవంతంగా ప్రయోగించి, దాని పనితనాన్ని రుజువు చేశారు.
  • ఇంతకు ముందు ISRO లాంచ్ వాహనాల్లో ఉపయోగించిన 16-బిట్ విక్రమ్1601కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్.

సాంకేతిక ప్రత్యేకతలు

Vikram 32 bit Processor, India's first own semiconductor chip

  • 32-బిట్ ఆర్కిటెక్చర్ – డేటాను 32 బిట్‌ల చంక్‌లలో ప్రాసెస్ చేస్తుంది.
  • ఫ్లోటింగ్ పాయింట్ కంప్యూటేషన్ సపోర్ట్ – సంక్లిష్టమైన గణనలను తేలికగా నిర్వహిస్తుంది.
  • కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ – ISRO అవసరాలకు సరిపోయేలా డిజైన్.
  • హై లెవెల్ లాంగ్వేజ్ సపోర్ట్ – విస్తృతమైన అప్లికేషన్లకు అనువుగా.
  • అత్యధిక ఉష్ణోగ్రతలు, అంతరిక్ష పరిస్థితులు తట్టుకునే స్థాయిలో తయారుచేయబడింది.

భారత్‌లో సెమికాన్ విప్లవం

2021లో ప్రారంభమైన ఇండియా సెమికండక్టర్ మిషన్ (ISM) కేవలం 3.5 ఏళ్లలోనే అబ్బురపరిచే ఫలితాలు ఇచ్చింది.

  • ఇప్పటివరకు ప్రభుత్వం ₹1.60 లక్షల కోట్లు విలువైన 10 ప్రాజెక్టులను ఆమోదించింది.
  • గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యూనిట్లు నిర్మాణదశలో ఉన్నాయి.
  • సనంద్ (గుజరాత్)లో మొదటి OSAT (Outsourced Semiconductor Assembly & Test) పైలట్ లైన్ ప్రారంభమైంది.
  • ₹76,000 కోట్లు విలువైన PLI స్కీమ్ కింద ఇప్పటికే ₹65,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.
  • Design Linked Incentive (DLI) స్కీమ్ కింద 23 డిజైన్ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి.

వ్యూహాత్మక ప్రాధాన్యం

సెమికండక్టర్లు ఆధునిక ప్రపంచానికి వెన్నెముక. ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్ష రంగం, కంప్యూటర్​..ఇలా ఒకటేమిటి? సెమీకండక్టర్​ లేని ఉపకరణాన్ని ఊహించలేం.  ప్రపంచమంతటా సెమికండక్టర్ చిప్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం సాధించడం వల్ల భారత్ ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వావలంబనలో మరింత బలపడనుంది.

మోదీ–వైష్ణవ్ వ్యాఖ్యలు

  • ప్రధాని మోదీ: “భారత్‌లో తయారైన అతి చిన్న చిప్ కూడా ప్రపంచంలో అతి పెద్ద మార్పు తేగల రోజు దూరం లేదు” అన్నారు.
  • అశ్విని వైష్ణవ్: “ప్రపంచం ఇప్పుడు భారత్‌ను నమ్మకంగా చూస్తోంది. స్థిరమైన పాలసీలు, ఆర్థిక వృద్ధి మధ్యలో భారత్ ఒక దీపస్థంభంలా నిలుస్తోంది” అని అన్నారు.

ప్రపంచంలోని 20% చిప్ డిజైన్ ఇంజినీర్లు భారత్‌లోనే ఉన్నారు. ఇప్పటికే Intel, Qualcomm, Nvidia, Broadcom, MediaTek వంటి దిగ్గజాలు బెంగళూరు, హైదరాబాద్, నోయిడాలో పెద్ద R&D సెంటర్లను ఏర్పాటు చేశాయి.
“విక్రమ్ 32-బిట్” ప్రారంభం భారత్‌ను చిప్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్, సాంకేతిక అభివృద్ధిలో విశ్వకేంద్రంగా నిలపడానికి పునాది వేస్తోంది.