నేటీ నుంచి ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు .. తెలంగాణ బోనాల దశాబ్ధి ఉత్సవాలకు 20కోట్లు
తెలంగాణ ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు నేడు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభంకానున్నాయి. తొలి రోజు ఆదివారం గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళీ దేవాలయంలో తొలి బోనాలు, తొట్టెల, రథం ఊరేగింపు, మెట్ల పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు నేడు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభంకానున్నాయి. తొలి రోజు ఆదివారం గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళీ దేవాలయంలో తొలి బోనాలు, తొట్టెల, రథం ఊరేగింపు, మెట్ల పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వరుసగా జంటనగరాల్లోని పలు ఆలయాల్లో కొనసాగనున్న బోనాల ఉత్సవాలు ఆగస్టు 4న ఇదే జగదాంబ మహంకాళీ ఆలయంలో కుంభహారతితో ముగిస్తాయి. జూలై 9వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీకి, 21న లాల్ ధర్వజా శ్రీ సింహవాహిణి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ బోనాల దశాబ్ధి ఉత్సవాల పేరుతో నిర్వహించేందుకు ప్రభుత్వం 20కోట్లు కేటాయించనున్నట్లుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆషాఢ బోనాల ఉత్సవాలను నిర్వహించే అమ్మవారి దేవాలయాల కమిటీలకు బోనాల నిర్వహణా ఖర్చుల నిమిత్తం శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పలు ఆలయ కమిటీలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోనాల జాతర పోస్టర్ ను, తేదీల వారీగా ఆయా దేవాలయాల్లో నిర్వహించే బోనాల జాతర వివరాలను తెలిపే బోనాల జాతర క్యాలెండర్ ను, వీడియో సాంగ్ ను, బోనాల చరిత్ర, సంస్కృతి, పరిణామక్రమం, క్రతువులను తెలుపుతూ సాంస్కృత శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ బోనాల పై రాసిన ‘బోనాలు’ పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ప్రజలు బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. బోనాలకు ఎంతమంది హాజరైనా ఇబ్బందులు కలగకుండా మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సాగుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విశ్వవ్యాప్తం చేస్తున్న బోనాల ఉత్సవాలను దిగ్విజయవంతంగా చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ బోనాల జాతరలో పాల్గొంటారని మంత్రి సురేఖ ప్రకటించారు. మంత్రులు ఆయా దేవాలయాల్లో బోనాలు సమర్పిస్తారని తెలిపారు.