విధాత, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, సస్పెండ్ అయిన అదనపు ఎస్పీ భుజంగరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అక్రమాస్తుల వ్యవహారంలో భుజంగరావుకు సంబంధించిన నివాసాలు, కుటుంబ సభ్యుల నివాపాలలో మొత్తం 10చోట్ల ఏసీబీ అధికారులు బుధవారం రోజంతా సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో రూ.5.92 కోట్ల విలువైన సొత్తును గుర్తించారు.ఏసీబీ సోదాల్లో ఆయనకు సూర్యాపేట , నల్గొండ జిల్లాల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 5 ఖాళీ స్థలాలు (open plots), 2 ఇళ్లు మరియు 1 వాణిజ్య భవనం, రూ.3.83 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ.8 లక్షలు, సుమారు 1 కిలో బంగారం, ఒక మారుతి స్విఫ్ట్ కారు, ఒక కియా సెల్టోస్ కారు, 29 మద్యం సీసాలను గుర్తించారు. భుజంగరావును రేపు గురువారం కోర్టులో హాజరుపరుచనున్నట్లుగా ఏసీబీ అధికారులు ప్రకటించారు.
