సర్పంచ్ పదవి కోసం తమ్ముడినే చంపేశాడు..రేపు నన్నూ చంపొచ్చు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే చంపిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి కోసం నన్నే చంపొచ్చు’ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ‘సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే చంపిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి కోసం నన్నే చంపొచ్చు’ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్ల లో జరిగిన సమావేశంలో ఆయన ఎర్ర శేఖర్ పై హాట్ కామెంట్ చేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరితే తాను జెడ్ ప్లస్ సెక్యూరిటీ తో తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట జడ్చర్ల ఎమ్మెల్యే లు అందరూ ఎర్ర శేఖర్ రాకను అహ్వానించరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇలాంటి ఫ్యాక్షన్ నేతలను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకునేందుకు సంసిద్దులుగా లేరని అనిరుధ్ రెడ్డి అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రోత్సహించదన్నారు. హత్యలకు పాల్పడిన ఎర్ర శేఖర్ ను కాంగ్రెస్ పార్టీ లోకి ఎలా వస్తారని, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవ్వరూ కూడా ఆయన రాకను స్వాగతించడం లేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల, నారాయణ పేటలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించిన ఎర్ర శేఖర్ టికెట్ దక్కక పోవడంతో వెంటనే బీ ఆర్ ఎస్ చేరారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నం చేశారు. అలాంటి ఎర్ర శేఖర్ ను కాంగ్రెస్ లో ఎలా చేర్చుకుంటారు’ అని అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. అయనలా మర్డర్లు చేసి రాజకీయంలోకి రాలేదని, నియోజకవర్గం ప్రజల మన్ననలతో రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.