వరంగల్ బల్దియా బడ్జెట్ ఆమోదం.. బీఆరెఎస్, బిజెపి కార్పొరేటర్ల నిరసన

విపక్షాల నిరసనల మధ్య వరంగల్ మహా నగర పాలక సంస్థ 2024-2025 సంవత్సర ముసాయిదా బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ సమావేశం ఆమోదించింది.

వరంగల్ బల్దియా బడ్జెట్ ఆమోదం.. బీఆరెఎస్, బిజెపి కార్పొరేటర్ల నిరసన

– రూ.650 కోట్ల అంచనాలతో ఆమోదం

– కౌన్సిల్ సమావేశంలో విపక్షాల నిరసన

– 2024-2025 ముసాయిదాకు గ్రీన్‌సిగ్నల్

– మేయర్ సుధారాణి పై బీఆరెస్, బీజేపీ ఆగ్రహం

– మేయర్ గా సుధారాణికి అర్హత లేదంటూ నిరసన

విధాత ప్రత్యేక ప్రతినిధి: విపక్షాల నిరసనల మధ్య వరంగల్ మహా నగర పాలక సంస్థ 2024-2025 సంవత్సర ముసాయిదా బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ సమావేశం ఆమోదించింది. బిజెపి, కార్పొరేటర్లు మేయర్ తీరుపై కౌన్సిల్ సమావేశం సాక్షిగా గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన మేయర్ సుధారాణికి బడ్జెట్ను ప్రవేశపెట్టే అర్హత లేదంటూ ఆందోళనకు దిగారు వీటన్నింటినీ పట్టించుకోకుండా అధికార కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రతిపాదనను ఏకపక్షంగా ఆమోదించింది. సమావేశం జరిగే కౌన్సిల్ కార్యాలయం సమీపంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలక వర్గం ఆమోదించింది. 1/3 కోరం ఉన్న తర్వాత బడ్జెట్ సమావేశం
ప్రారంభించారు.

బీఆరెఎస్, బిజెపి కార్పొరేటర్ల నిరసన

రూ.650 కోట్ల 12 లక్షలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ గందరగోళం మధ్య ఆమోదించారు. సమావేశ హాలు ముందు మేయర్ కి వ్యతిరేకంగా బీజేపీ, బీఆరెస్ కార్పొరేటర్లు నిరసన నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా సమావేశం కొనసాగించారు. కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాల మధ్య మేయర్ గుండు సుధారాణి బడ్జెట్ ను ప్రవేశపెట్టగా బడ్జెట్ పేపర్లను బీఆరెస్ కార్పొరేటర్లు లాక్కున్నారు. బీజేపీ కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. దేనికి పోటీగా కాంగ్రెస్ కార్పొరేటర్ల సైతం పెద్దపెట్టనా నినాదాలు చేశారు ఇరువర్గాల నినాదాలు మధ్యనే బడ్జెట్ ప్రతిపాదనలకు సమావేశం ఆమోదం తెలిపింది. టిఆర్ఎస్ నుంచి గెలిచి మేయర్ గా బాధ్యతలు చేపట్టిన గుండు సుధారాణి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సుధారాణికి మేయర్ గా బాధ్యతలు నిర్వహించే అర్హత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా కౌన్సిల్ సమావేశాన్ని చేపట్టడంతో కార్పోరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.

రూ.650 కోట్ల అంచనాలతో బడ్జెట్

రూ.650 కోట్ల 12 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో రూ.237 కోట్ల 2 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.410 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. బల్దియా స్వంత ఆదాయం ద్వారా వచ్చే 237 కోట్ల 2 లక్షల రూపాయలలో 80 కోట్ల రూపాయలు సిబ్బంది జీతభత్యాలు, 25 కోట్ల 80 లక్షల రూపాయలు పారిశుద్ధ్య నిర్వహణకు, 18 కోట్ల 45 లక్షల రూపాయలు విద్యుత్ చెల్లింపులకు, 23 కోట్ల 70 లక్షల రూపాయలు గ్రీన్ బడ్జెట్ కు, 25 కోట్ల 75 లక్షల రూపాయలు ఇంజనీరింగ్ విభాగానికి, 18 కోట్ల 50 లక్షల రూపాయలు సాధారణ నిర్వహణకు, 1 కోటి 20లక్షల రూపాయలు టౌన్ ప్లానింగ్ కోసం, కోటి 50 లక్షల రూపాయలు డిజాస్టర్ రెస్పాన్స్ కొరకు కేటాయించడం జరిగిందని అన్నారు.

విలీన గ్రామాలలో, బలహీనవర్గాలు నివసించే ప్రాంతాలలోని మురికివాడల అభివృద్దికి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 14 కోట్ల 4 లక్షలు , అలాగే ప్రజా సౌకర్యాల కల్పన, పార్కుల అభివృద్ధి, జంతువధ శాలలు, వీధి వ్యాపారులు వెండింగ్ జోన్లు, ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు రూ. 5 కోట్ల 20 లక్షలు, వార్డుల వారిగా అత్యవసర అభివృద్ధి పనులు చేపట్టుటకు గాను రూ. 22 కోట్ల 88 లక్షల రూపాయాలు కేటాయించినట్లు తెలిపారు.

నగరం ముంపుకు నివారణ చర్యల్లో భాగంగా కాలువలు నిర్మాణం చేపట్టుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరానికి రూ. 250 కోట్లు మంజూరు చేయడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య , కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖేడే,అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డిప్యూటీ మేయర్ రిజ్వాన షమిమ్ మసూద్, కార్పొరేటర్లు, బల్దియా వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.