Sircilla : నర్మాలలో చిక్కుకున్న ఐదుగురిని హెలికాప్టర్ల ద్వారా రక్షించిన అధికారులు
సిరిసిల్ల నర్మాల వద్ద వరదలో చిక్కుకున్న ఐదుగురిని ఆర్మీ హెలికాప్టర్లు రక్షించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, కామారెడ్డి జిల్లా వరద పరిస్థితులు గంభీరంగా ఉన్నాయి.

Sircilla | సిరిసిల్ల జిల్లాలోని నర్మాల వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఐదుగురిని ఆర్మీ సిబ్బంది రక్షించారు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగుమ మానేరు ప్రాజెక్టుకు అవతలి వైపున పశువులను మేపేందుకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు భారీ వర్షాలతో అక్కడే చిక్కుకున్నారు. పశువులు మేపేందుకు వెళ్లిన సమయంలో వరద లేదు. భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వరద వచ్చింది. దీంతో వారంతా అవతలివైపే ఉండిపోయారు. బుధవారం నాడు వరదలో చిక్కుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వరదలో చిక్కుకున్నవారికి అధికారులు, కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు. వరద ఎక్కువగా ఉండడంతో వారిని రక్షించేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ఫోన్ చేశారు. రాష్ట్రంలోని భారీ వర్షాలు కురిసినందున సహాయక చర్యల కోసం ఆర్మీ హెలిక్టాప్టర్లను పంపాలని కోరారు. అయితే వాతావరణం అనుకూలించనందున ఆర్మీ హెలికాప్టర్లు బుధవారం రాలేదు. ఇవాళ ఉదయం పది గంటల తర్వాత వాతావరణం అనుకూలించడంతో ఆర్మీ హెలికాప్టర్లను పంపుతున్నట్టు రక్షణశాఖ నుంచి రాష్ట్ర అధికారులకు సమాచారం వచ్చింది. గురువారం ఉదయం నర్మాల వద్ద చిక్కుకున్న ఐదుగురిని రెండు ఆర్మీ హెలికాప్టర్ సహాయంతో రక్షించారు. రెండు రోజులుగా కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. కామారెడ్డిలోని ఓ కాలనీలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు పోటెత్తింది.