హైదరాబాద్ రజాకార్ల చెరలో ఉంటే మీరేం చేశారు.. ఎంపీ అసదుద్ధిన్ ఫైర్

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 40 ఏళ్లుగా రజాకార్ల వారసుల చెరలో ఉందంటూ ఇటీవల బీజేపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తిప్పికొట్టారు.

హైదరాబాద్ రజాకార్ల చెరలో ఉంటే మీరేం చేశారు.. ఎంపీ అసదుద్ధిన్ ఫైర్

విధాత : హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 40 ఏళ్లుగా రజాకార్ల వారసుల చెరలో ఉందంటూ ఇటీవల బీజేపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తిప్పికొట్టారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ రజాకార్ల వారసుల చెరలో ఉంటే.. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.ఇక్కడ రజాకార్లు ఎవరు లేరని.. వారంతా పాకిస్థాన్‌కు పారిపోయారని తెలిపారు. హైదరాబాద్ మీద అమిత్ షాకు ఇంత అక్కసు ఎందుకని ఫైర్ అయ్యారు.

హైదరాబాద్‌ళో ప్రజలెవరూ భయంతో బ్రతకడం లేదని.. అందరూ కలిసిమెలిసే జీవిస్తున్నారని స్పష్టం చేశారు. మత రాజకీయాలు చేయాలనుకుంటే తన నియోజకవర్గ పరిధిలోని లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధికి మజ్లిస్ రూ.20 కోట్ల నిధులు ఎందుకు తీసుకొస్తుందో చెప్పాలన్నారు. అసలు అమిత్ షా హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఎంఐఎం కార్యాలయంతో పాటు తమ మనసులు అన్ని వర్గాల ప్రజల కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. మాటిమాటికి పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్‌ అని, ఐసీఎస్ అడ్డా అని, రోహింగ్యాలకు నిలయం అని అవమానిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అసలు మమ్మల్ని ఏం చేద్దామని ఫిక్స్ అయ్యారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.