కర్రీ పాయింట్‌లో రూ.10 కర్రీ ఇవ్వలేదని తల్వార్‌తో దాడి

చిన్న విషయానికే హింసకు దిగుతున్న ఘటనలు సమాజంలో పెరుగుతున్నాయి. తాజాగా రూ.10కి కర్రీ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి కర్రీ పాయింట్ సిబ్బందిపై తల్వార్‌తో దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కర్రీ పాయింట్‌లో రూ.10 కర్రీ ఇవ్వలేదని తల్వార్‌తో దాడి

విధాత, హైదరాబాద్ : రూ.10కి కర్రీ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి కర్రీపాయింట్ సిబ్బందిపై తల్వార్ తో దాడి చేసిన ఘటన మనుషుల్లో పెరిగిపోతున్న దుర్మార్గానికి నిదర్శనంగా నిలుస్తుంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీరం గూడ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఉన్న ఓం శ్రీ సాయి కర్రీ పాయింట్‌ కు జీవ రత్నం అనే వ్యక్తి వెళ్లి తనకూ రూ.10కి కర్రీ కావాలని అడిగాడు. రూ.10కి కర్రీ రాదని చెప్పడంతో ఆగ్రహానికి గురైన జీవరత్నం అందులో పనిచేస్తున్న ఉదయ్ (27), అజయ్ (19) అన్నదమ్ములపై తల్వార్‌తో దాడి చేశాడు.ఈ ఘటనలో ఇద్దరికీ తలపై తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది.

దాడి చేసిన వ్యక్తి అంబేద్కర్ కాలనీకి చెందిన జీవ రత్నంగా పోలీసులు గుర్తించారు.గాయపడిన వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అమీన్‌పూర్ పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.