KISHAN REDDY | నిరుద్యోగుల పట్ల బీఆరెస్, కాంగ్రెస్ దొందు దొందే … కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నిరుద్యోగులు గత బీఆరెస్ ప్రభుత్వంలో మోసపోయినట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సైతం మోసానికి గురవుతున్నారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు

విధాత, హైదరాబాద్ : నిరుద్యోగులు గత బీఆరెస్ ప్రభుత్వంలో మోసపోయినట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సైతం మోసానికి గురవుతున్నారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు చేపట్టిన నిరసనలపై స్పందించిన కిషన్‌రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని అశోక్ నగర్ లో అర్ధరాత్రి నిరుద్యోగుల ర్యాలీ చేపట్టిన తీరు వారిలోని ఆందోళనకు అద్ధం పడుతుందన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే వారు ఆందోళనలకు దిగుతున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే అబద్దపు, అమలు కానీ హామీలు, విఫలమైన గ్యారెంటీలు, రాజకీయ మోసం అని విమర్శించారు. తెలంగాణ యువత గత బీఆరెస్ పాలనలో పేపర్ లీకేజీలతో ద్రోహానికి గురైతే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అబద్దపు హామీలతో మోసం చేయబడి.. పూర్తిగా నిర్లక్ష్యానికి గుర్యయ్యారన్నారు. యువకుల ఆకాంక్షల నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారి అందోళనలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దీంతో యువత వారి భవిష్యత్తు కోసం వీధుల్లోకి వచ్చి పోరాడవలసి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు, మోసానికి నిరుద్యోగుల ఆందోళన నిదర్శనమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగుల నిరసనలను అవహేళన చేయడం మాని వారి న్యాయమైన డిమాండ్లపై బాధ్యాతయుతంగా స్పందించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.