Bathukamma Kunta| బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా!

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శుక్రవారం జరుగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవాన్ని భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

Bathukamma Kunta| బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా!

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government), హైడ్రా(HYDRA)లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునరుద్ధరణ చేసిన బతుకమ్మ కుంట(Bathukamma Kunta) చెరువు ప్రారంభోత్సవానికి వరుణుడు అడ్డుపడ్డాడు. నేడు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)చేతుల మీదుగా జరుగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవాన్ని(Lake Inauguration)  భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

 


రూ7.15కోట్లతో బతుకమ్మ కుంట పునరుద్ధరణ

ఒకప్పుడు బతుకమ్మ కుంట(ఎర్రకుంట)గా అంబ‌ర్‌పేట మండ‌లం, బాగ్అంబ‌ర్‌పేట్‌ వాసులకు జలవనరుగా ఉపయోగపడింది. పట్టణం విస్తరించడంతో క్రమంగా బతుకమ్మ కుంట ఆక్రమణలకు గురై ఆనవాళ్లు కోల్పోయింది. స‌ర్వే నంబ‌రు 563లో 1962 -63 లెక్క‌ల ప్ర‌కారం మొత్తం 14.06 ఎక‌రాల విస్తీర్ణంలో బ‌తుక‌మ్మ కుంట‌ రికార్డుల్లో ఉంది. బతుకమ్మ కుంట ఆక్రమణలపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా ముందుగా చెరువు భూములను సర్వే చేసింది. బ‌ఫ‌ర్ జోన్‌తో క‌లిపి మొత్తం వైశాల్యం 16.13 ఎక‌రాల విస్తీర్ణంగా స‌ర్వే అధికారులుతేల్చారు. మిగిలి ఉన్న భూములు సైతం భూ కబ్జాదారులైన సయ్యద్ ఆజం, సయ్యద్ జహాంగీర్, ఏ. సుధాకర్ రెడ్డిలు తమవే నంటూ కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ పిదప కోర్టులు అవి చెరువు భూమియేనని స్పష్టం చేశాయి. తాజా స‌ర్వే ప్ర‌కారం అక్క‌డ కేవ‌లం 5.15 ఎక‌రాల విస్తీర్ణం మాత్ర‌మే మిగిలి ఉంది. మిగిలిన 5.15 ఎక‌రాల విస్తీర్ణంలోనే హైడ్రా బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధ‌రించింది. రూ.7.15కోట్లతో చెరువు పనులను హైడ్రా ప్రారంభించగా..జేసీబీ రంగంలోకి దిగిన తొలి రోజున మోకాలి లోతులోనే గంగమ్మ ఎగిసిపడి చెరువు పునరుద్ధరణ పనులను స్వాగతించింది.

పునరుద్ధరణతో పూర్వ వైభవం

హైడ్రా చొరవతో కబ్జాల చెరవీడి..పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో తొలగించబడిన బతుకమ్మ కుంట సర్వాంగ సుందరంగా తయారైంది. పునరుద్దరణతో పూర్వ వైభవంతో పాటు ఆధునిక హంగులు అద్దుకున్న బతుకమ్మ చెరువు ప్రారంభోత్సవానికి సిద్దమైంది. చెరువు చుట్టు వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, వాకర్స్ కు కుర్చీలు, చెరువులో బోటింగ్, చుట్టు ట్యాంక్ బండ్, మహిళలు బతుకమ్మ ఆడేందుకు, నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లలో ఇప్పుడు బతుకమ్మ కుంట పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది.