- జాతీయోద్యమ వీరుల త్యాగాలు వెలకట్టలేనివి
- ఘనంగా భగత్ సింగ్, రాజుగురు, సుఖ్‌దేవ్ వర్ధంతి
- కాకతీయ యూనివర్సిటీలో పీడీఎస్‌యూ స్ఫూర్తి ర్యాలీ
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
PDSU | మోదీ ప్రభుత్వం భారత జాతీయ ఉద్యమ వీరుల ఆకాంక్షలను పూర్తిగా విస్మరిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్నదని పీడీఎస్‌యూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదలకు ఉచిత నాణ్యమైన, సమాన విద్య, వైద్యాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకతీయ యూనివర్సీటీలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని మేల్కొలుపు స్ఫూర్తి ర్యాలీని కాగడాలతో నిర్వహించారు. ముందుగా అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ నరసింహారావు, వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి అజయ్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ వీ కావ్య, రాష్ట్ర నాయకులు డీ వినయ్ ప్రసంగించారు.
రాజ్యాంగ బద్ధ సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకొని దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ, పౌరుల ప్రజాస్వామిక హక్కులను, భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని, లౌకిక వ్యవస్థను విచ్చిన్నం చేసే కుట్రలకు మోదీ ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను అర్బన్ నక్సల్స్ అంటూ అన్యాయంగా ముద్ర వేసి అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించి, కేవలం 8. 23% నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నదని విమర్శించారు.
గత నాలుగు సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఇవ్వవలసిన పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి, యువత… భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ పోరాట స్ఫూర్తితో విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఇరాన్ పై ఇజ్రాయిల్ –అమెరికా కొనసాగిస్తున్న యుద్ధోన్మాద దాడులను ఖండించాలని, దేశంలో రోజురోజుకు పెట్రేగిపోతున్న కుల, మతోన్మాద పాసిజాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. జిల్లా ఉపాధ్యక్షులు గణేష్, జిల్లా నాయకులు హర్షిత, యూనివర్సిటీ నాయకులు లోకేష్, అనిల్, నాగరాజు, మల్లేష్, ప్రశాంత్, మౌనిక, అరుణ్, వినయ్, శ్రీకాంత్, దామోదర్, అక్షర, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ట్రంప్ కు లొంగిన మోడీ ప్రభుత్వం: బాలరాజు
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 95వ సంస్మరణ కార్యక్రమం వరంగల్‌లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూ డెమోక్రసీ, ప్రజా సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు మాట్లాడుతూ బ్రిటిష్ వాడికంటే నేడు దేశంలో అనేక సామ్రాజ్యవాద దేశాలు తిష్ట వేశాయని, ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదులు దేశ సంపదను, ప్రజల శ్రమను దోచుకుంటున్నాయని ఆయన విమర్శించారు. గత కాంగ్రెస్ పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991 సంవత్సరంలో నూతన ఆర్థిక విధానాలు అమలు చేసి దేశ ప్రజలకు ద్రోహం చేసిందని, ఇటీవల మోదీ ప్రభుత్వం మధ్యంతర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసి కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలలో నడుస్తూ మరోసారి దేశ ద్రోహానికి పాల్పడిందని ఆయన అన్నారు. అమెరికా దాని దత్తపుత్రుడు, జియోనిస్ట్ ఇజ్రాయిల్ ప్రభుత్వాలు కలిసి ఇరాన్ దేశంలో మారణకాండ చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు గండ్రతి హరిబాబు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు, పూసల సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు గద్దల ప్రభాకర్, ఎండి ఖాన్, ఏలియా, బండి వెంకటేశ్వర్లు, రాజు, సుద్దాల వీరయ్య. ఎండి అక్బర్, ఇనుముల కృష్ణ, సాంబయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
