Indiramma Bima | జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ బీమా’

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, నిరుపేదల ముంగిటకే సంక్షేమ ఫలాలను చేరవేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మక 'ఇందిరమ్మ భీమా' పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

పేదరికంపై కాంగ్రెస్ సమరం
రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల భీమా రక్షణ
​మహిళా సంఘాలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
​సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లతో ప్రజా సంక్షేమమే లక్ష్యం
​ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Indiramma Bima | ​ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, నిరుపేదల ముంగిటకే సంక్షేమ ఫలాలను చేరవేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మక ‘ఇందిరమ్మ భీమా’ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కులమతాలకు అతీతంగా, పేద ధనిక భేదం లేకుండా రాష్ట్రంలోని కోటీ 15 లక్షల కుటుంబాలకు ఈ భీమా రక్షణ కవచంలా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు కనీసం లక్ష రూపాయల సాయం కోసం చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందని భట్టి విమర్శించారు. అటువంటి దుస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే, ప్రమాదవశాత్తు కుటుంబ యజమానిని కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ. 5 లక్షల భీమా వర్తింపజేయాలని ప్రాజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనికి సంబంధించి అధికారులు త్వరలోనే ప్రతి ఇంటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.

వ్యాపార వేత్తలుగా మహిళలు :

మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందులో భాగంగా మే 27వ మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు కేటాయించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు.

​లక్ష కోట్లకు వడ్డీలేని రుణాలు :

మహిళా సంఘాలకు ఏటా రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే దీనిని రూ. లక్ష కోట్లకు పెంచుతామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. త్వరలోనే మహిళా వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా 550 ఆర్టీసీ బస్సులను కేటాయించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

​గ్రామాల్లో ‘సన్నబియ్యం’ పండుగ:

మార్కెట్లో కిలో రూ. 50-55 పలుకుతున్న మేలు రకం సన్న బియ్యాన్ని రాష్ట్రంలోని కోటి 6 లక్షల కుటుంబాలకు ఉచితంగా అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని సగర్వంగా ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి మనిషికి 6 కేజీల చొప్పున నేరుగా పేదల ఇళ్లకే సన్న బియ్యాన్ని పంపిస్తామని చెప్పారు.

గృహజ్యోతితో 53 లక్షల కుటుంబాలకు లబ్ది :

రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండటం వల్ల రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలకు కరెంటు బిల్లుల భారం తప్పిందని అన్నారు. అనేక గ్రామాల్లో 95 శాతం ప్రజలు ‘జీరో’ బిల్లులు పొందుతున్నారని ఆయన వివరించారు.

​సొంతింటి కల సాకారం:

గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను వంచించిందని భట్టి ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో మరో 2 లక్షల ఇళ్లను అదనంగా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్య లక్ష్యమని అని చెప్పారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక కార్యకర్తలే దగ్గరుండి గృహప్రవేశాలు చేయించాలని సూచించారు.

​అల్పాహారంతో విద్యార్థులకు భరోసా:

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఉచిత ‘బ్రేక్‌ఫాస్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ప్రతి గింజను కొంటాం:

రైతుల పండించిన ప్రతి మొక్కజొన్న గింజను, ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని రైతులకు ఉప ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ​ దేశంలో ఎక్కడా మొక్కజొన్న కొనుగోళ్లు జరగకపోయినా, తెలంగాణలో పండిన ప్రతి మొక్కజొన్న గింజను, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం  రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులను ఆదుకుంటోందని అన్నారు. రైతుల అవసరాల కోసం క్యాబినెట్‌లో చర్చించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

​కుట్రలను తిప్పికొట్టండి!

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అటువంటి కుట్రలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ప్రభుత్వ పథకాలపై ఇంటింటికీ పాంప్లెట్లు పంపిణీ చేస్తామని, కాంగ్రెస్ కార్యకర్తలు గర్వంగా, తలెత్తుకుని గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వాస్తవాలు వివరించాలని భట్టి విక్రమార్క కోరారు. “మేము ప్రజలకు మాట ఇచ్చాం, ఈరోజు చేసి చూపిస్తున్నాం” అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లి చెప్పేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. “ఇది మన ప్రభుత్వం, ఇది మనం చేసుకున్న అభివృద్ధి” అని సగర్వంగా చెప్పుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించిందని భట్టి విక్రమార్క చెప్పారు.

Latest News