Koonanneni Sambasivarao | ధరణితో భారీ కుంభకోణం ,పేదలు లక్ష్యంగా బడ్జెట్ లేదు : కూనంనేని సాంబశివరావు
ధరణి రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణమని, కాస్తు కాలమ్ తీసేయడం ద్వారా గతంలో భూములమ్మిన వారు తిరిగి రికార్డుల్లోకి వచ్చారని, వాస్తవ సాగుదారులకు రైతుబంధు అందకుండా పాత భూస్వాములకు, రియల్టర్లకు మేలు జరిగిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

రుణమాఫీలో ఆంక్షలు ఎత్తివేయాలి
పంట బీమా పక్కాగా అమలు చేయాలి
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
విధాత, హైదరాబాద్ : ధరణి రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణమని, కాస్తు కాలమ్ తీసేయడం ద్వారా గతంలో భూములమ్మిన వారు తిరిగి రికార్డుల్లోకి వచ్చారని, వాస్తవ సాగుదారులకు రైతుబంధు అందకుండా పాత భూస్వాములకు, రియల్టర్లకు మేలు జరిగిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ధరణిలో అక్రమాలను విచారించి రైతుల ఇబ్బందులను తొలగించాలన్నారు. బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను సరిదిద్ధి రైతు భరోసా, రైతుబీమా, రైతు రుణమాఫీ పథకాలను రైతులకు అందించాలన్నారు. రుణమాఫీలో నెలకొన్న ఆంక్షలతో రైతులకు నష్టం జరుగుతుందని వాటిని ఎత్తివేయాలని కోరారు. పేదల లక్ష్యంగా బడ్జెట్ లేదన్నారు. ఆదాయం, అప్పులు..వ్యయం మధ్య సమన్వయం ఏట్లా సాధిస్తారన్నదానిపై బడ్జెట్‌లో స్పష్టం లేదన్నారు. ప్రభుత్వంపై కనీసం ఏడాది సమయం ఇవ్వకుండానే విమర్శలు చేయడం సరికాదని నా అభిప్రాయమని, హామీలిచ్చాకా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పులు చేసిందని, దీంతో ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పేదల కళ్లల్లో సంతోషం చూడాలంటే కూడు, గూడు, గుడ్డ, విద్యా, వైద్యం వంటి వాటిని వారికి అందించాలని, ఆ రంగాలకు ఈ బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేవని తప్పుబట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టులంటే పాలకులకు ఏటీఎంలుగా మారిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలన్నారు. మూడు బ్యారేజీలకే విచారణ పరిమితం చేస్తే ఈ ప్రాజెక్టులో జరిగిన భారీ కుంభకోణం బయటకు రాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రద్దు అంటే ప్రస్తుతం దెబ్బతిన్న మూడు బ్యారేజీలను రద్దువరకే పరిమితమవుతుందన్నారు. అందులో ఎల్లంపల్లి మాత్రమే కీలకంగా ఉన్నందునా మూడు బ్యారేజీల రద్దుతో నష్టం లేదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకెళ్లాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి బడ్జెట్‌లో చర్యలు లేకపోవడం బాధకరమని, వారి సమస్యలు నెరవెర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కాగా మధ్యలో హరీశ్‌రావు జోక్యం చేసుకోగా, నేను మాట్లాడితే హరీశ్‌రావుకు కోపం వస్తుందని, పాత మిత్రుడని మీ పట్ల, ప్రభుత్వం పట్ల మిత్ర ధర్మం పాటిస్తున్నానని, నా ఓరిజినాలిటీ మీకు తెలియదని, ఒరిజినాలిటీ మొదలెడితే అప్పుడెంటో మీకు తెలుస్తుదని, మీరు నా జోలికి రావద్దని హితవు పలికారు.