Katepalli Venkataramana Reddy | కూల్చివేతలు కాదు.. గతంలో అనుమతులిచ్చిన వారిపై చర్యలేవి: ఎమ్మెల్యే కాటెపల్లి
హైడ్రా (HYDRA) ఆలోచన బాగున్నా.. ఆచరణలో అది సామాన్యులకు ఎక్కువగా నష్టం చేసేదిగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు

హైడ్రాపై బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి ధ్వజం
Katepalli Venkataramana Reddy | హైడ్రా (HYDRA) ఆలోచన బాగున్నా.. ఆచరణలో అది సామాన్యులకు ఎక్కువగా నష్టం చేసేదిగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా కొత్తగా సాదించిందేమీ లేదని, సామాన్యుల బతుకులు కూల్చడం తప్ప అని ఘాటుగా విమర్శించారు. హైడ్రాపై మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతామని వెంకటరమణారెడ్డి తెలిపారు. గతంలో బఫర్ జోన్ (Buffer zone)లలో అనుమతులు ఇచ్చిన అదికారులను వదిలేసి.. సామాన్యులపై పడటం ప్రజాపాలన అవుతుందా? అని ప్రశ్నించారు. “భూమి కొనుగోలు చేసినప్పుడు చాలా మందికి అది ఏ పరిధిలోనిది అనేది తెలియదని, హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో భూమి ఉందా? అనుమతులున్నాయా! లోన్ వస్తుందా? అనేది మాత్రమే ప్రజలు చూస్తారన్నారు. రియల్టర్లకు అనుమతులు ఎవరిచ్చారు? లేఔట్ వేసేందుకు పర్మిషన్లు ఇచ్చిందెవరన్నది ప్రజలకు తెలియవన్నారు.
ప్రభుత్వ అనుమతులతోనే ప్రజలు గతంలో భూములు, ప్లాట్లు కొన్నారన్నారు. బఫర్ జోన్లు, చెరువులు, శిఖం భూములని తెలియకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండానే రియల్టర్ల చేతుల్లోకి వెళ్లాయా? ప్రభుత్వానికి తెలియకుండానే ఎఫ్‌టీఎల్ (FTL) ప్రకారం డాక్యుమెంట్లు ఎలా తయారయ్యాయి? అనుమతి లేకుండానే లేఔట్లు ఎలా అయ్యాయని? ఇళ్ల నిర్మాణంతో పాటు ప్లాట్లు ఎలా అమ్ముడయ్యాయి? దానికి బాధ్యులెవరు? అనుమతి ఇచ్చిన జీహెచ్ఎంసీది తప్పా? కమిషనర్లది తప్పా? బఫర్ జోన్లు, చెరువులు, శిఖం భూములని తెలిసి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బాధ్యులైన అధికారుల పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌లు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు . చెరువులు, బఫర్ జోన్లు, శిఖం భూములంటూ ఏ ప్రాతిపదికన ఇళ్లు కూలుస్తున్నారని, ఇష్టారీతిన డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు.