కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ లాలూచీ : మంత్రి పొంగులేటి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించకుండా బీఆర్ఎస్, బీజేపీ లాలూచి పడుతున్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేస్తే... రాష్ట్రానికి మోడీని తీసుకొచ్చి, జై శ్రీరామ్ అనిపిస్తే రాష్ట్రానికి ఏమైనా నిధులొస్తున్నాయా? అంటూ మరో మంత్రి కొండా సురేఖ నిలదీశారు. పంట ఉత్పత్తుల ధరల నిర్ణయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు అనేక కొర్రీలు పెడుతోందని ఇంకో మంత్రి సీతక్క భగ్గుమన్నారు. హనుమకొండలో మంగళవారం రాష్ట్ర రైతు మేళాలో రైతుల సమస్యలపై ప్రసంగిస్తూనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీరు, నాయకుల విమర్శలపై మండిపడ్డారు. రైతు వేదికగా మంత్రులు చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
- మోదీతో జై శ్రీరామ్ అనిపిస్తే నిధులొస్తాయా?
- బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు
- రాష్ట్ర బీజేపీ నేతలపై ముగ్గురు మంత్రుల ఫైర్
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందని పేర్కొందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందంటూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ సీబీఐకి అప్పగించి 9 నెలలు గడిచినా ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. ఈ విషయంలో విచారణ చేపట్టకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాలూచి పడుతున్నాయని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు, ఇక్కడి బీజేపి ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. రాజకీయంగా లాభం కోసం లాలూచి పడకుండా కాళేశ్వరంతోపాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో బీజేపీ నాయకులు తమ నిజాయతీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
మీటింగ్ పెట్టి, జై శ్రీరాం అంటే రాష్ట్రానికి లాభమేంటీ? : కొండా సరేఖ
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. తెలంగాణలో బీజేపీ నేతలు మీటంగ్‍లు పెట్టడం, మోదీని తీసుకొచ్చి… ఆయనతో జై శ్రీరాం అనడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. జై శ్రీరాం అంటే పైనుండి పైసలు పడుతున్నాయా..?!! రాష్ట్రానికి ఏమైనా పథకాలు వస్తున్నాయా? అని ప్రశ్నించారు. మోదీని తీసుకువచ్చి ఓ మీటింగ్ పెట్టించి, హిందీలో నాలుగు మాటలు మాట్లాడించి తిరిగి పంపించివేస్తారన్నారు. ఇక్కడ ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిధుల విషయంలో ఏమీ మాట్లాడరని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించే ప్రయత్నం కూడా చేయరన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఇక్కడి బీజేపీ నేతలు నోరుమూసుకుని మౌనంగా కూర్చుంటారని ధ్వజమెత్తారు. ఇక గోదావరి పుష్కరాల కోసం పక్కన ఉన్న ఏపీకి కోట్లాది రూపాయలు కేంద్రం విడుదల చేస్తే తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు.
బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు:
బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించి, కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారనే విషయాన్ని గులాబీ నేతలు మరిచిపోతున్నారని కొండా సురేఖ విమర్శించారు. బీఆర్ఎస్.. కళ్లు ఉండి చూడని, చెవులు ఉండి వినలేని పార్టీ అని దుయ్యబట్టారు. ప్రత్యేకించి కేటీఆర్‌కు ఈ విషయం ఎక్కువగా వర్తిస్తుందన్నారు. రైతుల కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆరెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రైతులకు వ్యతిరేకంగా మూడు నల్లచట్టాలను బీజేపీ తీసుకువస్తే వాటికి బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. అలాంటి బీఆర్ ఎస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్నారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించడంతో ఓర్చుకోలేక విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉండటాన్ని బీఆర్ఎస్ ఓర్చుకోవడం లేదన్నారు. పదేళ్ల ఇచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ మేమిచ్చిన హామీలపై ప్రశ్నిస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి ఇచ్చారా? , మూడెకరాల భూమిచ్చారా? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లిచ్చారా? అంటూ ప్రశ్నించాలని కోరారు.
అడ్డంకులు సృష్టిస్తున్న బీజేపీ: సీతక్క
పంట ఉత్పత్తుల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ రకరకాల అడ్డంకులు సృష్టిస్తున్నదంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. ధాన్యం ఇంతే కొనుగోలు చేయాలంటూ వివిధ నిబంధనలు విధిస్తోందన్నారు. పైగా తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతోందని మంత్రి సీతక్క అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram