BRS vs Congress | మూసీ అంచనాల పెంపుపై బీఆరెస్‌, కాంగ్రెస్ ట్వీట్ల యుద్ధం

మూసీ నది ప్రక్షాళన అంశాలపై ట్విటర్ వేదికగా బీఆరెస్‌, కాంగ్రెస్ పార్టీలు ట్వీట్ల యుద్ధం సాగిసున్నాయి. మూసీ నది ప్రక్షాళన అంచనాలు 50వేల కోట్ల నుంచి 1లక్ష50వేల కోట్లకు పెంచడంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై ట్విట్టర్ టిల్లూకు కొన్ని ప్రశ్నలంటూ కాంగ్రెస్ కౌంటర్ వేసింది

BRS vs Congress | మూసీ అంచనాల పెంపుపై బీఆరెస్‌, కాంగ్రెస్ ట్వీట్ల యుద్ధం

సుందరీకరణతో హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందన్న కాంగ్రెస్‌
అంచనాల పెంపు ఢిల్లీకి కప్పం కట్టడానికేనా అని బీఆరెస్ ప్రశ్న

విధాత, హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన అంశాలపై ట్విటర్ వేదికగా బీఆరెస్‌, కాంగ్రెస్ పార్టీలు ట్వీట్ల యుద్ధం సాగిసున్నాయి. మూసీ నది ప్రక్షాళన అంచనాలు 50వేల కోట్ల నుంచి 1లక్ష50వేల కోట్లకు పెంచడంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై ట్విట్టర్ టిల్లూకు కొన్ని ప్రశ్నలంటూ కాంగ్రెస్ కౌంటర్ వేసింది. మూసీ ప్రక్షాళన చేస్తామంటే నీకెందుకు బాధవుతోందని ప్రశ్నించింది. ⁠

మూసీ కలుషితంతో ప్రజల ఆరోగ్యం పై పడుతోన్న ప్రభావం ఎంత? ఆ ప్రభావం వల్ల రోగాల బారిన పడి వైద్యానికి ప్రజలు ప్రతి ఏటా తెలియకుండా చేస్తోన్న ఖర్చు ఎన్నివేల కోట్లు, ⁠మూసీ కింద రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఆయకట్టు ఉన్న విషయం అమెరికాలో “ఆ పని” చేసొచ్చిన నీకు తెలవకపోవడంలో ఆశ్చర్యం లేదంటూ కేటీఆర్ ట్వీట్ తరహాలో కవితాత్మక సెటైర్లు సంధించింది. ⁠మూసీ సుందరీకరణతో హైదరాబాద్ కు పెరిగే బ్రాండ్ ఇమేజ్ విలువ నువ్వు అంచనా కట్టగలవా?.⁠

పర్యాటకం పెరగడం వల్ల ఆదాయం వస్తుందన్న విషయం నీకు తెలుసా, ⁠దాని పరీవాహకంలో కొన్ని వేల మంది పొందే ఉపాధి విలువ ఎంతో నీకు తెలుసా అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. నీ దృష్టిలో అభివృద్ధి అంటే ⁠రియల్ ఎస్టేట్ కంపెనీలు కట్టే అద్దాల మేడలేనా అంటూ నిలదీసింది. ⁠మూసీ ప్రక్షాళనను కాళేశ్వరంతో పోల్చి మీ దోపిడీని మరోసారి గుర్తు చేస్తున్నావా అని, నీ పోలికతో కూలిన కాళేశ్వరమే మళ్లీ కళ్ల ముందు కనిపిస్తున్నది నీకర్థమవుతోందా? అంటూ విమర్శించింది.

ఘాటుగా రీట్వీట్ చేసిన బీఆరెస్

మూసీ ప్రక్షాళనపైన, హైదరాబాద్ బ్రాండ్ పైన కాంగ్రెస్ లక్ష్యంగా కేటీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్‌కు బీఆరెస్ పార్టీ తిరిగి ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుబడుతూ రీట్వీట్‌తో ప్రతిస్పందించింది. సున్నాలు, కన్నాలు వేసే సీఎం రేవంతూ.. నీ మతిలేని చర్యలతో హైదరాబాద్ మహానగర పరువు తీస్తున్న కాంగ్రెస్ పార్టీ, నువ్వు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటంటూ బీఆరెస్ తన ట్వీట్‌లో విమర్శించింది.

ముందు నీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నామంటూ బీఆరెస్‌ హయాంలో ప్రణాళికలు రూపొందించిన మూసీ పునరుజ్జీవ, సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,500 కోట్లు.. ఇప్పుడు అది అమాంతం ఎందుకు పెరిగినట్లని బీఆరెస్ ప్రశ్నించింది. అదే ప్రాజెక్టుకు తట్ట మట్టి ఎత్తకుండా వ్యయాన్ని రూ. 16,500 కోట్ల నుండి రూ. 1,50,000 కోట్లకు ఎందుకు పెంచినట్లని, పెరిగిన ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎవరి జేబులు నింపడానికని నిలదీసింది.

మొదట మూసీ సుందరీకరణకు రూ. 50,000 కోట్లు అవసరమని నువ్వే అన్నావని, ఇప్పుడు అదే నోటితో రూ. 1,50,000 కోట్లు కావాలి అంటున్నావని, అది నోరా.. లేక మోరా? అని విమర్శించింది. 3-4 నెలల్లోనే లక్ష కోట్ల వ్యయం ఎలా పెరిగిందని, ఈ సొమ్ము అంతా ఢిల్లీకి కప్పం కట్టడానికా? అని ప్రశ్నించింది. మనులు మొదలవ్వకముందే అంచనాలు పెంచి.. ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగ తినడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటి అని, ఈ మూసీ ప్రాజెక్టు కూడా ఆ కోవలోకి చెందిందేనా? అని మరోసారి నిలదీసింది. గుంపు మేస్త్రి.. మూసీ ప్రక్షాళన కంటే ముందు, నీ నోటిని ప్రక్షాళన చేసుకో అని హితవు పలికింది.

ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయకుండా పూటకో మాట మార్చి నోటికొచ్చింది ఒర్రకని, ఇట్లనే ఒర్రుకుంట పోతే రంగు పడుద్ది! అని హెచ్చరించింది. ప్రతిసారి కేటీఆర్‌ను యూఎస్‌లో అది చేశావ్, ఇది చేశావ్ అని అవమానిద్దాం అని చూస్తున్నారని, కానీ స్వంతంగా పనిచేసే ప్రతి ఒక్క ఎన్నారైని మీరు అవమానిస్తున్నారని గుర్తుంచుకోండని బీఆరెస్ పేర్కోంది.