KTR | డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో మూడేళ్ల క్రితమే తమ నిర్ణయం చెప్పామని, అందులో ఎలాంటి మార్పు లేదని కేటీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. 2023 సెప్టెంబర్‌లో తాను చేసిన పోస్టును కేటీఆర్ మరోసారి ట్యాగ్ చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డిలిమిటేషన్ జరిగితే, అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగా మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, మూడేళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన స్టాండ్‌కే కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.
తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో తమ ప్రజల స్వరాన్ని, ప్రాతినిధ్యాన్ని అణచివేయాలని చూస్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, “ఢిల్లీ పాలకులు తమ మాట వినాలని, విజ్ఞత ప్రదర్శించాలని ఆశిస్తున్నాం” అంటూ ఆయన పేర్కొన్నారు.
This was the BRS stand three years ago
And it remains unchanged https://t.co/v0Qx6bNgZh
— KTR (@KTRBRS) April 15, 2026
