విధాత: సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించి, కేంద్రంలోని ప్రధాని మోడీ విజయాలను ప్రచారం చేస్తూ తద్వారా బీజేపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి విజయరామారావు పిలుపునిచ్చారు. గురువారం నల్గొండలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను బూత్ స్థాయి వరకు తీసుకెళ్లాలన్నారు. కేసిఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్‌లు, రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి అమలు చేయలేదని వాటిపై ప్రజలను కదిలించి ఉద్యమాలు ఉధృతం చేయాలని సూచించారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ పథకం డబ్బులు అందిస్తామని చెప్పి వారితో డీడీలు కట్టించుకొని ఇప్పటికీ పంపిణీ చేయలేదని విమర్శించారు. జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేయిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి కూడా నిర్మాణం పూర్తి చేయించలేకపోయారని ఆరోపించారు.
అలాగే డిండి ఎత్తిపోతల, ఉదయ సముద్రం ప్రాజెక్టుల పరిస్థితి కూడా నత్తనడకన సాగుతూనే ఉన్నాయన్నారు. నల్గొండ డిండి రోడ్డుకు నిధులు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మాణం జరగడం లేదన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని ఇవ్వడం లేదన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని మండిపడ్డారు.
జిల్లా బత్తాయి రైతుల కోసం బత్తాయి, టమాటా ప్రాసెసింగ్ యూనిట్ లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి సర్పంచులను అప్పులపాలు చేస్తుందని ఆరోపించారు. ఆయా ప్రజా సమస్యలపై బీజేపీ శ్రేణులు ప్రజల్లో చైతన్యం కల్పించి ఉద్యమించడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద పీట వేశారన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్నారని, రానున్న ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పారు.
కార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి ఆర్.ప్రదీప్ కుమార్, బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్ యాదవ్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, కర్నాటి సురేష్, sk బాబా, వంగాల స్వామి గౌడ్, కంకణాల నివేదిత రెడ్డి, దాసొజు యాదగిరా చారి, బిజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరీ రవి గౌడ్, నాగం వర్థిత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు,,వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.