పదేండ్ల నుంచి కర్ఫ్యూ, మతకల్లోలం లేదు : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు.. చీమ కూడా చిటుక్కుమనలేదు. హిందూ, ముస్లింలందరూ కలిసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారని కేసీఆర్ తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో పదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు.. శాంతియుంతంగా రాష్ట్రం పురోగమిస్తుంది. కాంగ్రెస్ దుర్మార్గులు మా ఎమ్మెల్యే అభ్యర్థి మీద కత్తులతో దాడి చేశారు. భగవంతుడి దయ వల్ల చావలేదు. తొందరగా ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ చేశాం కాబట్టి.. ప్రాణాలు కాపాడగలిగాం. మేం ఎన్నడూ అరాచకం చేయలేదు. పదేండ్లలో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజలకు మంచి చేశాం. దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కుట్రలు, పగలు పట్టలేదు. ఆ రకంగా మేం వ్యవహారం చేయలేదు.
నేను చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుని ముందకు పోవాలి. మనకు కులం, మతం లేదు.. జాతి లేదు. ప్రజలందరూ మనవారే. తెలంగాణలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా మన మనిషే. తెలంగాణలో ఎవరూ బాగుపడ్డా మనం బాగుపడ్డట్టే. ప్రతి వ్యక్తి ముఖం మీద చిరునవ్వు ఉండాలి. మతకల్లోలాలు లేవు. హిందూ, ముస్లిం కలిసి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. హైదరాబాద్‌లో గతంలో ప్రతి ఏడాది కత్తిపోట్లు, మతకల్లోలాలు, కర్ఫ్యూలే. కానీ గత పదేండ్లుగా చీమ చిటుక్కుమనలేదు.
అందరి యొక్క సంక్షేమం చూడాలి. తెలంగాన ఈ రోజు పంజాబ్‌ను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో ముందుకు పోతుంది. నాలుగు కోట్ల టన్నులు పండించి దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా అవతరించనుంది. కరెంట్ కోతల్లేవు. మంచినీళ్ల బాధలు లేవు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.. భాస్కర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించండి.