3 భాగాలుగా రాష్ట్రాభివృద్ధి: క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్

తెలంగాణను మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారదర్శకమైన విధానాలతోనే అభివృద్ధి సాగాలని..పెట్టుబడుల విషయంలో రాష్ట్రానికి చెందిన వారికే మొదటి ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేశారు

3 భాగాలుగా రాష్ట్రాభివృద్ధి: క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్

విధాత : తెలంగాణను మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారదర్శకమైన విధానాలతోనే అభివృద్ధి సాగాలని..పెట్టుబడుల విషయంలో రాష్ట్రానికి చెందిన వారికే మొదటి ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే తాము.. ఇక్కడే ఉన్న వారిని ఎందుకు వదులుకుంటాం? అన్నారు. పారదర్శక విధానంలో మాత్రమే ప్రజల కోణంలో సహకారం ఉంటుందన్నారు. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివన్నారు. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని రేవంత్ చెప్పారు.

రాజకీయ నేతలు సృష్టించే అపోహలు నమ్మితే నష్టపోతారు
రాజకీయాల్లోనూ కాదు..వ్యాపార, వాణిజ్య రంగాలలోనూ ఒకరు కుర్చీలో కుర్చున్నప్పుడు మిగిలిన 9 మంది నిరాశ చెందుతారని..ప్రత్యర్థులు సృష్టించే అపోహలకు లోనై వాటిని వ్యాపింపచేస్తే మన దేశానికి, రాష్ట్రానికి, మనందరికీ నష్టం అని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అపోహలు, అనుమానాలను దాటుకుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునే వారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నాన్నారు.

పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదని..జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేదని రేవంత్ రెడ్డి అన్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలని..లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నానన్నారు. నగర ప్రతిష్ఠ పెంచడానికే తమ ప్రయత్నం అని సీఎం స్పష్టం చేశారు. మాటిమాటికీ ఢిల్లీకి వెళుతున్నారని కొందరు మాట్లాడుతున్నారని..మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని..కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతామని ప్రశ్నించారు. కేంద్రం వద్ధ 26 వేల కోట్ల రుణాలను 35 ఏళ్లకు 7.5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయించామని..అలా 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నామని వెల్లడించారు.

మరిన్ని విమానాశ్రయాలు..డ్రై పోర్టు నిర్మాణాలు
మహారాష్ట్రలో 40విమానాశ్రయాలుంటే తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని..మెట్రో, ఎయిర్ పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు 11 కొత్త రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. హైదరాబాద్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని..త్వరలోనే అనుమతులు రాబోతున్నాయని సీఎం రేవంత్ తెలిపారు.