విధాత : కేంద్రంలో ప్రధాని మోదీ పన్నెండేళ్ల పాలన, రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనపైన, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ కు లేఖలు రాయండి..మేం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని, ఎన్ని రోజులైన మీ మ్యానిఫెస్టోలపైన మా మ్యానిఫెస్టోలపైన చర్చిద్దాం అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. నల్లగొండ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో మోదీ పాలనపైన, బీఆర్ఎస్ పాలనపైన, రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనపైన గ్రామాలలో చర్చ పెట్టాలని సూచించారు.బావ బామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ లు ఊరురా తిరిగి కాంగ్రెస్ పోవాలని దుష్ప్రచారం చేస్తున్నారని, మళ్లీ పాపాల భైరవుడు కేసీఆర్ పాలన రావాలని అంటున్నారని మండిపడ్డారు. ఫామ్ హౌజ్ శుక్రాచార్యుడు కేసీఆర్, మారీచ సుబాహులు కేటీఆర్, హరీశ్ రావులకు నిజం మాట్లాడితే వారి తల వేయి ముక్కలవుతుందని దేవుడి శాపం ఉందంటూ చురకలేవారు. గురుకులాలో 680కోట్ల టెండర్లు పిలిస్తే 2000 కోట్ల అవినీతి జరిగిందని, టెండర్లు పూర్తికాని సింగరేణిలో బొగ్గు మాయమైందని పదేపదే అబద్దాలు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అయితే ఉద్యమకాలం నుంచి కల్వకుంట్ల కుటుంబం అవకాశ రాజకీయాలను, చెప్పినఅబద్ధాలను, చేసిన నాటకాలు చూశారని ఇక తెలంగాణ ప్రజలు,సమాజం వారిని నమ్మరని క్షమించరు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు .
పేదోళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలే..వాళ్లకు మాత్రం ఫామ్ హౌజ్ లు
కల్వకుంట్ల కుటుంబంలోని అందరూ వందల ఎకరాల్లో ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారని, మేం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుంటే వారికి కడుపు రగిలిపోతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు పేదోళ్లకు ఇండ్లు ఇచ్చుంటే సంవత్సరానికి 2లక్షల చొప్పున పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 20 లక్షలు ఇల్లు కట్టి ఉండేవారని, పేదవాళ్ల ఆత్మగౌరవంతో బతికి ఉండేవారని, పేదలకు ఇళ్లు ఇచ్చే సోయి కేసీఆర్ కు లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2014లో 60 వేల కోట్ల నుంచి 6లక్షల కోట్లకు అప్పుల పాలు చేసింది మీరు కదా..? అని, మీ కుటుంబం, మీ దోపిడి, దొంగతనాల్లో బాగాస్తులే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. ఎస్ఎల్బీసీని కాంగ్రెస్ హయాంలో 34కిలో మీటర్లు పూర్తి చేయగా..మిగిలిన పది కిలోమీటర్లను పదేళ్లలో పూర్తి చేయకుండా పక్కన పెట్టి నల్లగొండ ప్రజలను ఫ్లోరైడ్ పాలు చేసిన పాపం మీది కదా..? అని ప్రశ్నించారు.
త్యాగం వారిది…దోపిడీ మీది..
తెలంగాణ సాధనలో.. మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలిన కొండ లక్ష్మణ్ బాపూజీ ముందంజలో ఉంటే.. ఆ తర్వాత నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారన్నారు. వారిది త్యాగమైతే..కల్వకుంట్ల కుటుంబం ఉద్యమం ముసుగులో ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్ రాజకీయం చేసిందని, కోమటిరెడ్డి, శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య, యాదయ్య, ఈశాన రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి త్యాగాల ముందు.. అగ్గిపెట్టె రావు త్యాగం ఎంత..? అని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు గతం మాత్రమే మిగులుతుందని, మీకు మళ్ళీ పదవులు రావు అని, బీఆర్ఎస్ నాయకులను ప్రజలు ఉప్పు పాతర వేశారని, మళ్ళీ మొలవనియ్యం అన్నారు. సూర్యాపేట లో మూడు అడుగుల నాయకుడిని మళ్ళీ అసెంబ్లీలోకి రానివ్వమని ఆ ప్రాంత యువత అంటున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు.
ప్రజా పాలన ఎందుకు పోవాలి ?
ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం అని, కేసీఆర్ తినే సన్ని బియ్యాన్నే పేదలకు అందిస్తున్నామని, రైతులకు 30నెలల కాంగ్రెస్ పాలనలో 1లక్ష 56వేల కోట్ల ఖర్చు చేశామని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ అందించామని, కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ఒక సంవత్సరంలో 2లక్షల85,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించామని గుర్తు చేశారు.30 నెలలు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచామని, ఇన్ని విజయాలు సాధించినందుకు కాంగ్రెస్ పోవాల్నా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ బడులను, ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని, యంగ్ ఇండియా స్కూల్స్ తెచ్చామని గుర్తు చేశారు. పాపాల భైరవుడి మళ్లీ వచ్చి ఏం చేస్తాడని, భార్యభర్తల ఫోన్లు వినడం తప్పా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హాయాంలో కాళేశ్వరం కడితే కూలేశ్వరమైపోయి లక్ష కోట్ల గోదావరిలో కలిసిపోయాయని, కల్వకుంట్ల కుటుంబం అవినీతితో వేలకోట్లు దోచుకుందని విమర్శించారు. పరీక్షల ప్రశ్న పత్రాలు అమ్ముకొని వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఐదేళ్లు మహిళలకు క్యాబినెట్ లో చోటు ఇవ్వని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని, ఆనాడు కొత్త రేషన్ కార్డులు దిక్కులేదు అని, మేం కొత్త కార్డులు ఇచ్చాం అన్నారు.
మూసీ ప్రక్షాళన నా జీవితాశయం
మూసీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజల సమస్యలను తీర్చేందుకు మూసీ ప్రక్షాళన చేపడితే బీఆర్ఎస్ , బీజేపీలు అడ్డుపడుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన నా జీవిత లక్ష్యం అని, గుజరాత్ సబర్మతి,ఢిల్లీ యమునా, యూపీ గంగానది కాకుండా.. ఈ దేశానికి ఎవరు వచ్చినా మూసీ నదీ చూసేలా..దేశానికే తలమానికంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.మూసీ ప్రక్షాళన చేసి మూసీ కంపు నుంచి నల్గొండ బిడ్డలను విముక్తి చేస్తానని ఒట్టేసి చెబుతున్నాని, మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డం పడ్డా,, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలో వేసి తొక్కుతానని హెచ్చరించారు.
2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎవడెవడైతే మాట్లాడుతుండో వాళ్లు రాసుకోవాలని, 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల తీరుస్తుందని, ప్రజా పాలన ప్రజల ఉనికిని కాపాడుతుందని, ఇదే నా మాట అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా చేస్తానని, అందుకు మీరు ఆశీర్వదించి అండగా నిలబడాలని ప్రజలను కోరారు. నల్గొండ జిల్లాకు కావలసిన పనులన్నీ చేస్తానని, ఎన్నికలలో చెప్పిన పనులను పూర్తి చేస్తానని, ఎస్ఎల్బీసీని వచ్చే ఎన్నికలలోగా నూటికి నూరు శాతం పూర్తిచేస్తానని..నల్గొండ నేల మీద కృష్ణా జలాలను పారిస్తానని, డిండి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నా సంపూర్ణ సహకారం అందిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
