CM Revanth Reddy : కండువా వేస్తే పార్టీ మారినట్టా?
కండువా వేస్తే పార్టీ మారినట్టా? స్థానిక సంస్థల ఎన్నికలు, బీఆర్ఎస్ ఫిరాయింపులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ ఫిరాయింపులపై నిర్ధిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంలో బీఆర్ఎస్ పార్టీకే స్పష్టత లేదని ఆయన సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ కు అసెంబ్లీలో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీశ్ రావు అన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ, తమకు 37 మంది ఎమ్మెల్యేలు కాదని మరో సంఖ్యను కేటీఆర్ చెబుతున్నారని ఆయన అన్నారు. తన ఇంటికి వచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్టేనా అని ఆయన ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చినవాళ్లకు ఏ కండువా వేస్తానో వచ్చినవాళ్లకు ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు. పార్టీ మారిన విషయంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని ఆయన అన్నారు. కల్వకుంట్ల కుటుంబ పంచాయితీతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి పంచాయితీ నడుస్తోందని ఆయన విమర్శించారు. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్,కేటీఆర్,హరీశ్, సంతోష్ అని అర్ధం అవుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరుతా అని కవిత అంటే వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ యువతను పొట్టనబెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కవిత దూరమైందని ఆయన అన్నారు. గతంలో తన కూతురు పెళ్లికి కూడా వెళ్లకుండా అడ్డుపడ్డారని ఆయన గుర్తు చేశారు. ఒక ఆడబిడ్డపై నలుగురు దాడి చేస్తున్నారన్నారు. 2014-19 కాలంలో కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కుటుంబ వ్యవహారంలో సామాన్య ప్రజలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారని సీఎం చెప్పారు. మెట్రో విషయంలో కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి మెలికలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడ కేటీఆర్ చెబుతున్నారు.. అక్కడ కిషన్ రెడ్డి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైద్రాబాద్ మెట్రో విషయంలో ఎల్ అండ్ టీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో విచారణ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ ఇప్పటివరకు సీబీఐ విచారణ ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టు పరిధిలో ఉందన్నారు. అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వలేదని ఆయన వివరించారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు సిద్దమని చెబుతున్నారని ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలన్నారు. కిషన్ జీ భార్య ఇటీవల లొంగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోలేదు
సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి వద్దే పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. . స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. అసెంబ్లీ పంపిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 90 రోజుల్లోపుగా వాటిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ 90 రోజుల గడువు వరకు వెయిట్ చేస్తామని ఆయన అన్నారు. కోర్టుకు వెళ్లాలా, వద్దా అనే విషయమై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.