కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలవబోతుందని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

  • Publish Date - April 24, 2024 / 03:43 PM IST

సికింద్రాబాద్‌లో గెలిచేది మేమే
కేసీఆర్‌ను నమ్ముకుంటే పద్మారావు మునుగుడే
దానం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్: కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలవబోతుందని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 2004, 2009లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలిచిందని.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ సారి మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని జోస్యం చెప్పారు.

ఆనాడు దత్తాత్రేయని ఓడించి.. అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరేశారని, అప్పుడు కేంద్రంలో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్ కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నారన్నారు. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ను గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత తనదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లో ఇప్పటిదాక గెలిచిన బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు అయినా హైదరాబాద్‌కు చేసిందేమిటని ప్రశ్నించారు.

వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమైతే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లిగవ్వ తేలేదని విమర్శించారు. జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కాంగ్రెస్సే కారణమని చెప్పారు. బీఆరెస్ అభ్యర్థి పద్మారావు మంచోడే కానీ కేసీఆర్‌ను నమ్ముకుంటే ఆయన మునిగినట్టేనని, అతని పరువు తీయడానికే సికింద్రాబాద్ అభ్యర్ధిగా నిలబెట్టారని ఎద్దేవా చేశారు. పద్మారావు నామినేషన్‌కు కేటీఆర్, కేసీఆర్ ఎందుకు రాలేదని, ఆయనకు వాళ్ళు ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు. సికింద్రాబాద్ సీటును బీజేపీకి బీఆరెస్ నేతలు తాకట్టు పెట్టారని విమర్శించారు.

పద్మారావును ఓడించి కిషన్ రెడ్డిని గెలిపించేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చకు కేటీఆర్ సిద్ధమా అన్నారు. సికింద్రాబాద్‌లో బీఆరెస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. ప్రధాని మోదీ దేవుడిని బజారులోకి తీసుకొచ్చారని, రాముడి పేరుతో మతచిచ్చు పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. మత సామరస్యాన్ని కాపాడింది మా పార్టీయేనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత మాదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Latest News