CM Revanth Reddy | ఖ‌మ్మం జిల్లా స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ది

జై తెలంగాణ నినాదం ప్రారంభమైన‌దే పాల్వంచ నుంచి, ఇక్క‌డి నుంచి వచ్చిన స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు

CM Revanth Reddy  | ఖ‌మ్మం జిల్లా స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ది
  • బీజేపీ మెడ మీద వేలాడుతున్న క‌త్తి
  • వ‌చ్చే ఎన్నిక‌లు గుజ‌రాత్ – తెలంగాణ మ‌ద్యే
  • కొత్త‌గూడెంలో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత‌: జై తెలంగాణ నినాదం ప్రారంభమైన‌దే పాల్వంచ నుంచి, ఇక్క‌డి నుంచి వచ్చిన స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కు గొప్ప పోరాట చరిత్ర ఉందన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ‌నివారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో ఆయ‌న‌ ప‌ర్య‌టించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీకి ఒక్క సీటు ఇచ్చారు, ఆ ఎమ్మెల్యే కూడా ఇండియా కూటమికి మద్దతు తెలిపార‌న్నారు. ఖమ్మంలో ప్రతి కార్యకర్త  ఒక ముఖ్యమంత్రేన‌ని గతంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించిన సంద‌ర్భాన్ని గుర్తు చేశారు. ఖమ్మం ప్రజల చైతన్యం తెలంగాణ ప్రజలకు ఆదర్శమ‌ని, కాలకూట విషమున్న కేసీఆర్ ను ముందుగానే పసిగట్టి వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టారన్నారు.

బిఆరెస్ అభ్య‌ర్థి నామా నాగేశ్వర్‌ రావును బకరా చేయడానికి కేంద్ర మంత్రిని చేస్తానని కేసీఆర్ అంటున్నాడు, కేసిఆర్ ను న‌మ్మి నాగేశ్వ‌ర్ రావు మోస‌పోవ‌ద్దన్నారు. బీఆర్ఎస్ ఇంటి పైన వాలిన కాకిని  మా కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఇంటి పైన వాలనివ్వరన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నారు, ఈ కుట్ర‌ను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. డిసెంబర్ 3 న వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే, ఆ ఎన్నికల్లో కేసీఆర్ నడుం విరగగొట్టార‌న్నారు.  వచ్చే ఎన్నికల్లో గుజరాత్ వర్సెస్ తెలంగాణ టీం మధ్య పోటీ జరగబోతుందన్నారు.ఫైనల్స్ లో గుజరాత్ టీం ను ఓడించి ఛాంపియన్ షిప్ గెలవాలని రేవంత్‌రెడ్డి పిల‌పునిచ్చారు. భద్రాచలం రాములవారి సాక్షి గా తెలంగాణ రైతులకు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటాన‌ని ఆయ‌న మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. బీజేపీ మెడ‌పై వేలాడుతున్న క‌త్తిలాంటిద‌ని, ఆ పార్టీకి ఓటు వేస్తే రిజ‌ర్వేష‌న్లు త‌ప్ప‌కుండా ర‌ద్దు చేస్తుంద‌న్నారు. ఖమ్మం అభ్యర్థి ఆర్‌.రఘురామిరెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి పోరిక‌ బలరాం నాయక్ ను మూడు లక్షల మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఓట‌ర్ల‌ను కోరారు.