15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ

ఈ నెల 15న కామారెడ్డిలో లక్ష మందితో సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది

15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ
  • లక్షమందితో భారీ కార్యక్రమం
  • ప్రభుత్వం చేసిన పనుల వివరణ
  • బీసీ డిక్లరేషన్ పైనే ఫోకస్

విధాత : ఈ నెల 15న కామారెడ్డిలో లక్ష మందితో సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామో డిక్లరేషన్ లో వివరించింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో చట్ట సవరణ చేసింది. ఇది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి ఈ నెల 15వ తేదీకి ఏడాది పూర్తి కానుంది. దీంతో కామారెడ్డిలోనే సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన స్థలంలోనే ఈ సభ కూడా నిర్వహించనున్నారు.

విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ రెండు అంశాలపై తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపారు. ఈ బిల్లులు ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. గత నెల 31న జరిగిన సమావేశంలో గత ప్రభుత్వం చేసిన మున్సిపల్, పంచాయితీరాజ్ చట్టాలను సవరించారు. దీంతో మున్సిపాలిటీలతో పాటు ఇతర స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం లభిస్తోంది. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సభలో కాంగ్రెస్ వివరించనుంది. ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు తెలుపుతారు. కులగణన, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేయనున్నారు.