Danam Nagender | త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆరెస్ ఎల్పీ విలీనం: దానం నాగేందర్
త్వరలో బీఆరెస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు

ఆ పార్టీలో మిగిలేది నలుగురే
రేపో ఎల్లుండో మరో ఆరుగురు
నాపై అనర్హత సంగతి తర్వాత..ముందు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో
విధాత, హైదరాబాద్ : త్వరలో బీఆరెస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హిమాయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగేందర్ బీఆరెస్ పార్టీని కేటీఆర్ కార్పోరేట్ కంపనీలాగా నడిపారని విమర్శించారు. కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదని, ఒకవేళ దొరికినా… గంటల తరబడి నిరీక్షించాల్సివచ్చేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు. బీఆరెస్‌పై నమ్మకం లేకనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు.
రేపు ఎల్లుండి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్నారు, మరో 15రోజుల్లో బీఆరెస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందన్నారు. బీఆరెస్‌లో ఎటు పోవాలో తెలియని ఎవరైనా నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిపోతారన్నారు. బీఆరెస్‌లో కేటీఆర్ ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని, అందుకే విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్‌లో చేరుతున్నారని స్పష్ట్టం చేశారు. కాంగ్రెస్‌లో అందరికి విలువ ఉంటుందని, ఆత్మగౌరవంతో జీవించవచ్చన్నారు. నేరుగా సీఎంను, మంత్రులను కలవవచ్చన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండేదని, బీఆరెస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదని దానం వాపోయారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వారు ఉన్న చోట, భూములున్న చోటనే వేల కోట్ల నిధులు కేటాయించి రోడ్లు వేశారన్నారు.
వేలకోట్లు సంపాదించుకున్న కేటీఆర్ బినామీలు
బీఆరెస్‌లో సీఎంను కలవాలంటే నలుగురిని అపాయింట్‌మెంట్ అడిగినా రోజులు గడిచినా లభించేది కాదన్నారు. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని, వాటి వివరాలు త్వరలో బయట పెడతానని చెప్పారు. 10 ఏళ్లలో కేటీఆర్ బినామీలు గుండు శ్రీను, తేజరాజు, రాజేశ్ రాజు వందలు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారని, వందలు, వేల కోట్లు సంపాదించారని వాళ్ల చరిత్ర అంతా త్వరలోనే బయటపెడుతానన్నారు. జైళ్లకు పోయినోడిని తీసుకొచ్చి వేలకోట్లు సంపాదించుకునే ఏర్పాటు చేశారన్నారు.
ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని కేటీఆర్ మేకపోతు గంభీరం చూపిస్తున్నారని, సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా… రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ కోర్టు కెక్కారని, దానిపై నేను కోర్టులో తేల్చుకుంటానని, అయితే నాపై అనర్హత వేటు వేసే లోపల నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో అంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. హైదరాబాద్ సిటీలో మేం చేయించిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఆపివేయగా, సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు.