డీఎస్సీ 2008 బాధితులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు
సబ్ కమిటీ నిర్ణయం మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా డీఎస్సీ-2008 బాధితులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 14 సంవత్సరాల తమ కల నెరవేరనుందని సంతోషం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని 2009 నుంచి న్యాయస్థానాల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నామన్నారు.

- ఈ నెల 27వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
- ఉమ్మడి జిల్లా కేంద్రాలవారీగా వెరిఫికేషన్
- ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ
డీఎస్సీ-2008 బాధితులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు బాధితులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం ఈ నెల 27వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 5వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు 2008 డీఎస్సీలో 30 శాతం కోటాతో నష్టపోయిన అభ్యర్థుల జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా డీఈవోలకు పంపినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచినట్టు తెలిపారు. హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నది. ఈ సమయంలోనే.. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఒప్పుకుంటున్నట్టు సమ్మతి పత్రం సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గజిటెడ్ అధికారి సంతకంతో కూడిన ఇతర విద్యార్హత పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. డీఈవోలు ఈ పత్రాలను పరిశీలించిన తర్వాత ఎవరెవరికి ఉద్యోగాలు ఇవ్వవచ్చో, ఎవరికి ఇవ్వరాదో సూచిస్తూ విద్యాశాఖకు అక్టోబర్ 6న నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన పూర్తి జాబితాను క్యాబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచనున్నది. కమిటీ ఆమోదం అనంతరం పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,367 మంది అభ్యర్థులు నష్టపోయినట్టు ఇప్పటికే విద్యాశాఖ గుర్తించింది.
నెరవేరనున్న 15 ఏండ్ల కల
2008లో నాటి ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చట్ట విరుద్ధమని బీఈడీ అభ్యర్థులు కోర్టుకు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారమే ఫలితాలు విడుదల చేసి.. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించింది. అయితే డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, 30 శాతం కోటా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం డీఈడీ అభ్యర్థులకు 30 శాతం పోస్టులు కేటాయించి కౌన్సిలింగ్ నిర్వహించింది. దీంతో కామన్ మెరిట్ లిస్ట్‌లో ఉండి, 30 శాతం కోటా వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి 14 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు ఏపీలో రెండేండ్ల కిందట డీఎస్సీ 2008 బాధితులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు.
తెలంగాణలోనూ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. విధివిధానాల బాధ్యతను క్యాబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. సబ్ కమిటీ నిర్ణయం మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా డీఎస్సీ-2008 బాధితులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 14 సంవత్సరాల తమ కల నెరవేరనుందని సంతోషం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని 2009 నుంచి న్యాయస్థానాల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి డీఎస్సీ- 2008 మెరిట్ బీఈడీ క్యాండిడేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమా మహేశ్వర్ రెడ్డి, కార్యదర్శులు సంగమేశ్వర్, చంద్రశేఖర్, రమేశ్, డీఎస్సీ-2008 సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు.