Contractors Dharna : కాంగ్రెస్ స‌ర్కార్ ప‌రువుతీసిన డిప్యూటీ సీఎం!

ఎవ‌రికి వారు ప‌ర్సంటేజీలు తీసుకుని బిల్లులు విడుద‌ల చేయిస్తుండ‌టాన్ని ఏడాదిపాటు భ‌రించిన కాంట్రాక‌ర్లు ఇక లాభం లేద‌ని ఏకంగా స‌చివాల‌యంలోనే ధ‌ర్నాకు దిగ‌డంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప‌రువు పోయింద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Contractors Dharna : కాంగ్రెస్ స‌ర్కార్ ప‌రువుతీసిన డిప్యూటీ సీఎం!
  • ఏడాదికాలంగా క‌మీష‌న్ల దందా?
  • స‌చివాల‌యంలో కాంట్రాక్ట‌ర్ల ధ‌ర్నా
  • మ‌ల్లు భ‌ట్టి భార్య పెత్త‌నంపై విమ‌ర్శ‌లు

Contractors Dharna : రాష్ట్రంలో నియంత పాల‌న ముగిసి ప్ర‌జాస్వామ్య పాల‌న కాంగ్రెస్ నాయ‌క‌త్వంలో వ‌చ్చింద‌ని సంబుర‌ప‌డిన ప్ర‌జ‌ల ఆశ‌లు ఆడియాస‌లు అయ్యేలా పాల‌న సాగుతున్న‌ద‌న్న‌ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఎవ‌రికి అందిన‌కాడికి వారు దోచుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు గ్రామ‌స్థాయి వ‌ర‌కు పాకాయి. మంత్రులు పోటీప‌డి కోట్ల రూపాయ‌లు దండుకుంటున్నార‌ని గ్రామాల్లో న‌లుగురైదుగురు క‌లిసిన చోట‌ల్లా చ‌ర్చించుకుంటున్నారు. వీట‌న్నింటికీ ప‌రాకాష్ట‌గా.. రాష్ట్ర స‌చివాల‌య చ‌రిత్ర‌లో తొలిసారి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క చాంబ‌ర్ ముందే ప‌లువురు కాంట్రాక్ట‌ర్లు ధ‌ర్నాకు దిగ‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపింది. క‌డుపుమండిన కాంట్రాక్ట‌ర్లు ఏడాదికాలంపాటు ఎదురు చూసి.. ఇక లాభం లేద‌ని ప్రత్య‌క్షంగా ఆందోళ‌న‌కు దిగారంటే ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో ఊహించుకోవ‌చ్చు. డిప్యూటీ సీఎంకు విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించగా, భ‌ద్ర‌తా సిబ్బంది అనుమ‌తించ‌లేదు. తిరిగి సాయంత్రం వ‌చ్చి ఆయ‌న‌కు విన‌తిప‌త్రం అంద‌చేసి అల్టిమేటం ఇచ్చి వెళ్లిపోయారు. ఈ నెల 20వ తేదీ లోపు రూ.10 ల‌క్ష‌ల లోపు బిల్లుల‌ను విడుద‌ల చేయాల‌ని, లేదంటే 25వ తేదీన అసెంబ్లీని ముట్ట‌డిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ‌కు ఏడాదికాలంగా న‌ర‌కం చూపిస్తున్నార‌ని, మామూళ్లు ఇచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నార‌ని, త‌మలాంటి కాంట్రాక్ట‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సుమారు రెండు వంద‌ల మంది కాంట్రాక్ట‌ర్లు ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న‌కు దిగ‌డం స‌చివాల‌య ఉద్యోగుల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

కాంట్రాక్టులు ద‌క్కించుకున్న త‌రువాత త‌మ ఆస్తులు, బంగారం విక్ర‌యించి, అప్పులు చేసి పూర్తి చేశామ‌ని, అయినా డ‌బ్బులు చెల్లించ‌డం లేద‌ని తెలంగాణ సివిల్ కాంట్రాక్ట‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ మండిప‌డింది. రూ.10 ల‌క్ష‌ల లోపు ప‌నులు పూర్తి చేసిన వారు బిల్లులు కోసం ఏడాది కాలంగా స‌చివాల‌యంలోని ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే రామ‌కృష్ణారావు, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కార్యాల‌యం చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేస్తున్నామ‌న్నారు. అప్పుడూ, ఇప్పుడూ అని చెప్పి ఎప్ప‌టిక‌ప్పుడు దాట వేస్తున్నార‌ని, ఎప్పుడు ఇస్తామ‌నేది స్ప‌ష్టంగా చెప్ప‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలినాళ్ల‌లో డిపార్ట్‌మెంట్ల‌వారీగా ప‌ర్సంటేజీలు నిర్ణ‌యించి, బిల్లులను పాస్ చేసి డ‌బ్బులు విడుద‌ల చేశార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నాలుగు శాతం నుంచి మొద‌లైన క‌మీష‌న్లు ప్ర‌స్తుతం 14 శాతానికి చేరుకున్నాయ‌ని వినిపిస్తున్న‌ది. బ‌డా బ‌డా కాంట్రాక్ట‌ర్ల నుంచి ప‌ర్సంటేజీలు తీసుకునేందుకు ప్ర‌త్యేక విధానాన్ని అమ‌లుప‌రుస్తున్నార‌ని అంటున్నారు.

డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి భార్య నందిని అనుమ‌తిస్తే త‌ప్ప ఒక్క బిల్లు పాస్ కావడం లేద‌ని ప‌లువురు బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్నారు. సాధార‌ణంగా బిల్లులు స‌మ‌ర్పించిన కాంట్రాక్ట‌ర్లు లేదా టెండ‌ర్లు, నామినేష‌న్లు ద‌క్కించుకున్న వారికి టోకెన్ నంబ‌ర్ ఇస్తారు. ప్రాధాన్య క్ర‌మంలో టోకెన్ నంబ‌ర్లవారీగా ఆన్‌లైన్‌లో డ‌బ్బులు బ‌దిలీ చేస్తారు. మ‌ల్లు నందినిని క‌లిసిన త‌రువాతే బిల్లుల‌కు మోక్షం ల‌భిస్తున్న‌ద‌ని, లేదంటే టోకెన్ నంబ‌ర్‌కు దిక్కుండ‌ద‌ని స‌చివాల‌యంలో ఉద్యోగులే చర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈమె వ్య‌వ‌హారం ఇలా ఉంటే డిప్యూటీ సీఎం పేషీలోని ఒక‌రిద్ద‌రు ఉద్యోగులు కూడా తాము కూడా త‌క్కువేమీ కాదంటున్నారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి పేషీలో ప‌నిచేసిన ఒకాయ‌న కూడా దందా న‌డిపిస్తున్నాడ‌ని విమ్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న‌కు బిల్లులో ఒక శాతం క‌మీష‌న్ ఇస్తే త‌ప్ప ప‌ని ముందుకు క‌ద‌ల‌డం లేద‌ని కాంట్రాక్ట‌ర్లు ఆరోపిస్తున్నారు. ఇంత‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో దానం నాగేంద‌ర్ వ‌ద్ద ప‌నిచేసిన ఒకాయ‌న కూడా ఇదే పేషీలో ప‌నిచేస్తున్నారు. ఆయ‌న కూడా క‌మీష‌న్లు తీసుకుని ప‌నులు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇలా ఎవ‌రికి వారు ప‌ర్సంటేజీలు తీసుకుని బిల్లులు విడుద‌ల చేయిస్తుండ‌టాన్ని ఏడాదిపాటు భ‌రించిన కాంట్రాక‌ర్లు ఇక లాభం లేద‌ని ఏకంగా స‌చివాల‌యంలోనే ధ‌ర్నాకు దిగ‌డంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప‌రువు పోయింద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.