బీఆర్ఎస్ వైఫల్యాలపై కాదు..మనం చేస్తున్నది చెప్పాలి: సీఎం రేవంత్ రెడ్డి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాకుండా ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించారు. బడ్జెట్ సమావేశాల్లో సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు.

బీఆర్ఎస్ వైఫల్యాలపై కాదు..మనం చేస్తున్నది చెప్పాలి: సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం అని, ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో వివరించామని, గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయింది అని, మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలి అని రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు మార్గదర్శకం చేశారు. సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగిన సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో సభలో మాట్లాడే అంశాలపై విప్ ల మధ్య సమన్వయం ఉండాల అని సూచించారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాల అని తెలిపారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సబ్జెక్ట్ మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వలేదు అని, సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నన్ను సభకు రాకుండా చేశారు అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, సంపత్ లను సస్పెండ్ చేశారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించవద్దు అని, మహిళా శాసన సభ్యులు హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలని, సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలి అని తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు.. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది అన్నారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది అని, పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్ లోనే అందరూ స్పందించాలని స్పష్టం చేశారు. ఇది మన ప్రభుత్వం.. ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్ నే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుంది అని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఉద్బోదించారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాని, నియోజకవర్గ సమస్యలపై మాట్లాడితే మంచిదని రేవంత్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశానికి కూడా కొంత మంది ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడం పట్ల రేవంత్ అసహనం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

గోదావరి జలాల దోపిడీపై ఏపీ కన్ను..సీఎం రేవంత్ మౌనం : హరీశ్ రావు ధ్వజం
భారత్ కు తీరనున్న ఎల్పీజీ గ్యాస్ తిప్పలు!