భారత్ కు తీరనున్న ఎల్పీజీ గ్యాస్ తిప్పలు!

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలతో భారత్‌లో ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరతకు ఉపశమనం లభిస్తోంది. ఖతార్ నుంచి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో రెండు నౌకలు గుజరాత్ తీరానికి చేరుకోవడంతో 65 లక్షల సిలిండర్ల కొరత తీరనుంది.

భారత్ కు తీరనున్న ఎల్పీజీ గ్యాస్ తిప్పలు!

విధాత : ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు,గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఆటంకాలతో భారత్ లో ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ సమస్యలు తీరిపోయే సమయం వచ్చింది. హర్మూజ్ జలసంధి మీదుగా ఇరాన్ అనుమతుల మధ్య భారత్ కు చెందిన రెండు నౌకలు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ తీసుకొస్తున్నాయి. ఈ గ్యాస్ రాకతో 65 లక్షల డొమెస్టిక్ సిలిండర్ల కొరత తీరనుంది. గ్యాస్ నిల్వలతో వస్తున్న ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ ఉంది. ఈ నౌక ఖతార్‌ నుంచి ఇవాళ గుజరాత్‌ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు సోమవారం చేరుకుంది. ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది. ఖతార్‌లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్‌ నౌక హర్మూజ్‌ జలసంధి నుంచి ప్రయాణించింది.

రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని తీసుకువస్తున్నాయి.

భారత్ వద్ద కేవలం 10 రోజులకు సరిపడా వంట గ్యాస్ మాత్రమే నిల్వ ఉందని చెప్తున్న ట్రేడ్ డేటా వెల్లడించడం ఆందోళన కరంగా మారింది. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరతతో హోటల్స్, రెస్టారెంట్లు మూతపడగా.. వంట గ్యాస్‌ల కోసం కిలోమీటర్ల మేర జనాలు క్యూ కడుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తుంటే..ట్రేడ్ డేటా మాత్రం 10రోజుల మేరకే గ్యాస్ నిల్వలు ఉన్నాయని పేర్కొనడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో రెండు నౌకల ద్వారా 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని భారత్ కు చేరడం భారీ ఊరటనిచ్చింది. ఇందుకు సహకరించిన ఇరాన్ కు భారత్ ప్రభుత్వం కృతఙ్ఞతలు చెప్పాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

యుద్దం కారణంగా 5,500 విమానాల రద్దు

మరోవైపు పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల కారణంగా భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కు పైగా విమానాలు రద్దయినట్లు పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు రాజ్యసభలో వెల్లడించారు. ఇందులో భారత విమానయాన సంస్థలకు చెందిన 4,335, విదేశీ సంస్థలకు చెందిన 1,187 విమానాలు ఉన్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Mandula Samuel : ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై కోడిగుడ్లతో దాడి
Pawan Kalyan | ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన పవన్ కళ్యాణ్ చెప్పులు… ధర ఎంతంటే?