Farmer loan waiver | షరతుల పేరుతో రైతులకు మోసం : మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 2లక్షల రైతు రుణమాఫీ హామీ అమలుకు సంబంధించి విడుదల చేసిన గైడ్‌లైన్స్‌పై అధికార, విపక్ష పార్టీల మధ్య పరస్పర మాటల యుద్దం సాగుతుంది.

Farmer loan waiver | షరతుల పేరుతో రైతులకు మోసం : మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

షరతుల పేరుతో రైతులకు మోసం
ఎన్నికలప్పుడు షరతులు ఎందుకు చెప్పలేదు?
ఏడు నెలలుగా రేషన్‌ కార్డులు ఎందుకివ్వలేదు?
రుణమాఫీకి షరతులు ఉపసంహరించుకోవాలి
లేదంటే రైతుల పక్షాన పోరాడుతాం
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
మాజీ మంత్రి టీ హరీశ్‌రావు
మార్గదర్శకాలు.. మభ్యపెట్టే ప్రయత్నాలు
మాఫీ భారం తగ్గించుకునేందుకే షరతులు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగేదాకా ప్రభుత్వాన్ని వదలం : బీజేపీ ఎంపీ డీకే అరుణ
రైతులకు ఉరి తాళ్లలా రుణమాఫీ గైడ్‌లైన్స్‌ ఉన్నాయి : ఈటల రాజేందర్‌

విధాత, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 2లక్షల రైతు రుణమాఫీ హామీ అమలుకు విడుదల చేసిన గైడ్‌లైన్స్‌పై అధికార, విపక్ష పార్టీల మధ్య పరస్పర మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు షరతులు ఎందుకు పెడుతున్నదని ప్రతిపక్ష బీఆరెస్‌, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా రేషన్‌ కార్డు నిబంధనను తప్పుబడుతున్నాయి. అయితే కుటుంబ వివరాల కోసమే రేషన్‌ కార్డు నిబంధన పెట్టామని, కార్డు ఉన్న లేకున్నా రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ కోదండరెడ్డిలు స్పష్టం చేస్తున్నారు.
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే.. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ షరతుల పేరుతో రైతులను మోసం చేస్తున్నదని స్పష్టంగా అర్థమవుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తామని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక షరతులెందుకని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కూడా రేషన్‌ కార్డులున్నవారికేమాఫీ చేస్తామని, కుటుంబానికి ఒకరికే మాఫీ చేస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. వారిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏడు నెలలుగా రేషన్‌ కార్డులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బ్యాంకర్లు రుణం ఇచ్చేటప్పుడు పాస్‌పుస్తకాలు చూశారే తప్ప రేషన్‌కార్డులు చూడలేదని గుర్తు చేశారు. బ్యాంకులకు లేని రేషన్‌ కార్డు గైడ్‌లైన్స్‌ ప్రభుత్వానికి ఎందుకని నిలదీశారు. రైతు కాదో చూస్తే సరిపోతుందన్నారు. రుణమాఫీ సహా కాంగ్రెస్‌ ఎన్నికల హామీల అమలు చూస్తుంటే రాష్ట్రంలో చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టు అనిపిస్తున్నదని ఎద్దేవాచేశారు. 75లక్షల మంది రైతులకు మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో వాగ్దానం చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. కుటుంబం, రేషన్ కార్డు అనే షరతులు ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. పీఎం కిసాన్ నిబంధన తీసుకోవడం అంటే 39లక్షల మంది రైతుల రుణమాఫీ ఎగ్గొట్టడమేనని ఆయన స్పష్టం చేశారు. 2లక్షల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని అన్నారు. రైతు రుణమాఫీని ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. స్వల్పకాలిక రుణాలకే వర్తిస్తుందని అంటూ పండ్ల తోటలు పెట్టిన రైతులకు ఎగ్గొడుతున్నారని విమర్శించారు. రీ షెడ్యూల్ రైతులకు వర్తించదంటే రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. షరతులు ఉపసంహరించుకోవాలని, లేదంటే రైతుల పక్షాన పోరాడుతామని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో రైతు రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

మార్గదర్శకాలు..మభ్యపెట్టే ప్రయత్నాలు : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి మార్గ‌ద‌ర్శ‌కాలు కావు.. మ‌భ్య పెట్టేందుకు ప్ర‌య‌త్నాలని మండిపడ్డారు. రుణమాఫీకి రేషన్‌ కార్డు, పీఎం కిసాన్ డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడమేనన్నారు. హామీలు ఇచ్చినప్పుడు లేని ఆంక్షలు.. అమలు చేసేటప్పుడు ఎందుకని ప్రశ్నించారు. రుణమాఫీలో రైతుల సంఖ్యను, మొత్తాన్ని తగ్గించేందుకే షరతులు పెట్టడం రైతాంగాన్ని వంచించడమేనని ఆరోపించారు. ఏడు నెలలు రైతాంగాన్ని ఆశల పల్లకిలో విహరింపచేసి మార్గదర్శకాల పేరుతో వారిని వంచిస్తున్నారన్నారు. మాఫీ భారం తగ్గించుకునేందుకే రుణమాఫీలో షరతులు పెడుతున్నారని ఆరోపించారు.

పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగేదాకా ప్రభుత్వాన్ని వదలం : బీజేపీ ఎంపీ డీకే అరుణ

రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేపీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ సభ్యురాలు డీ.కే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేసిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఇప్పుడు కొందరు రైతులకే రుణమాఫీ అంటూ ఇప్పుడు షరతులు పెట్టడం అన్యాయంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డు ఉంటేనే రైతు రుణమాఫీ చేస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు..ఎన్నికల్లో హామీలిచినప్పుడు రైతుభరోసా, రుణమాఫీపై మార్గదర్శకాలు ఇలా ఉంటాయని ఎందుకు చెప్పలేదని, ఇలానే జిల్లాల వారీగా ఎందుకు ప్రజల సలహాలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పుర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు రైతుల తరపున బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు అంటూ ఇప్పటికే ప్రజలను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు. ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదని అరుణ విమర్శించారు. ఒక్క ఆర్టీసీ బస్‌లో ఫ్రీ ప్రయాణం అంటున్నప్పటికి.. ఆ ఫ్రీ బస్‌తో కూడా మహిళలు హ్యాపీగా లేరన్నారు. ఇప్పటి వరకు రూ. 4000 పెన్షన్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ మాటల గారడీ చేస్తోందని, రేవంత్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ వ్యాఖ్యలు చేశారు.

రుణమాఫీ గైడ్‌లైన్స్‌ రైతులకు ఉరి తాళ్లలా ఉన్నాయి : ఈటల రాజేందర్‌

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయడం లేదని, ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ రైతులకు ఉరితాడులా ఉన్నాయని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ఎన్నికల ముందు రూ. 2 లక్షల రుణమాఫీ, ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి 6 పేజీల నిబంధనలు రూపొందించిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి చదువుకున్నారా? అని.. మూడున్నర ఎకరాలకు పైగా వరి పొలం ఉంటే రుణ మాఫీ రాదని, 7 ఎకరాలు మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు, రేషన్ కార్డు లేకుంటే రుణ మాఫీ రాదని, ఏడు ఎకరాలు పైబడి ఉంటే రుణ మాఫీ లేదని, రేషన్ కార్డు ప్రామాణికంగా రైతులను నిలువునా మోసం చేయడమేనని ఈటల తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల్లో రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా పాలసీలు ప్రకటించిందని.. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదని.. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఈటల విమర్శలు గుప్పించారు.

రుణమాఫీ నిబంధనలపై ప్రతిపక్షాల దుష్ప్రచారం : కోదండరెడ్డి

రుణమాఫీ అంశంపై రైతులు ఆందోళన వద్దని, నిబంధనలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు.
రేషన్ కార్డ్ తప్పనిసరి చేసింది కుటుంబ వివరాల కోసమేనని స్పష్టం చేశారు. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ నిబంధనలపై ఎవరికైనా సందేహాలు ఇబ్బందులు వున్నా పరిష్కరిస్తామని, వ్యవసాయ శాఖ అధికారుకారులను సంప్రదించవచ్చని తెలిపారు. రుణమాఫీపై మమ్మల్ని ప్రశ్నించే నైతికార్హత బీఆరెస్‌కు లేదన్నారు. భూమి ఆధారంగానే రుణం ఇస్తారన్న సంగతి బీఆరెస్‌ మాజీ మంత్రులకు తెలియంది కాదన్నారు. బీఆరెస్‌ ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిందని నిలదీశారు. మేం రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని స్పష్టంగా చెబుతున్నామన్నారు. బీఆరెస్‌ హయాంలో ధరణి వల్ల 20 లక్షల కుటుంబాలకు రైతుబంధు రాకుండా పోయిందని విమర్శించారు.

రైతులను మోసం చేసిన వారే మాపై విమర్శలు చేస్తున్నారు: మంత్రి తుమ్మల

రుణమాఫీ చేస్తామని గతంలో రైతులను మోసం చేసిన బీఆరెస్‌ వారే ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. తమ వద్ధ 2లక్షల రుణమాఫీకి అర్హులైన రైతులందరి వివరాలున్నాయని, కుటుంబం యూనిట్‌గా ఎంపిక ద్వారా రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బీఆరెస్‌ అమలు చేసిన రైతు రుణమాఫీ ప్రామాణికతనే తాము అనుసరిస్తున్నామన్నారు. బీఆరెస్‌ మిగిల్చిన అప్పులు కడుతునే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలోనే ఏకకాలంలో 2లక్షల రైతు రుణమాఫీ చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకోబోతున్నామన్నారు. 2018లో రెండో దఫా రుణమాఫీలో 20వేల కోట్లు ప్రకటించి 2023ఎన్నికల ముందు కేవలం 13వేల కోట్ల మేరకు మాఫీ చేసి రైతులను బీఆరెస్‌ మోసం చేసిందన్నారు.రైతులను మోసం చేసిన హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డిలకు మమ్మల్ని విమర్శించే అర్హత లేదన్నారు.