Avinash Mohanty | దళిత మహిళపై థర్డ్ డిగ్రీ కేసు.. డీఐ సహా ఐదుగురు పోలీసుల సస్పెండ్
షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సునీత అనే దళిత మహిళపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించి హింసించిన కేసులో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ
విధాత, హైదరాబాద్: షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సునీత అనే దళిత మహిళపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించి హింసించిన కేసులో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డితోపాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.
షాద్ నగర్‌కు చెందిన దళితవాడలో నివసించే నాగేందర్ తన ఇంట్లో 22.5 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ అయ్యాయంటూ జులై 24న పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేసులో విచారణ క్రమంలో ఈ వివాదం నెలకొంది. ఫిర్యాదుదారు నాగేందర్ ఎదురింట్లో భీమయ్య, సునీత దంపతులు నివసిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఈ దంపతులపై అనుమానంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. 30వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసులు మళ్లీ వచ్చి.. ఠాణాకు తీసుకొచ్చి వారిని తీవ్రంగా కొట్టారని బాధిత మహిళ సునీత ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వివాదస్పదమైంది.