ఆట మొదలైంది

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ పాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అక్రమాలపై విచారణకు సిద్ధమవుతున్నారు

ఆట మొదలైంది

– పాలమూరులో అక్రమ కట్టడాల కూల్చివేత

– వనపర్తిలో భూ దందాలపై విచారణ

– దేవరకద్ర, మక్తల్ లో అభివృద్ధి చాటున అక్రమాలు

– మాజీల భూకబ్జాలు తెరపైకి?

– అవినీతి అధికారులపైనా ఆరా

– ప్రజా పాలనకు నూతన ఎమ్మెల్యేల శ్రీకారం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ పాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అక్రమాలపై విచారణకు సిద్ధమవుతున్నారు. అక్రమంగా కాజేసిన ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మూతపడిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల బూజు దులుపుతున్నారు. పూజా కార్యక్రమాలతో ఆయా భవనాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు నేరుగా కలవవచ్చని ఎమ్మెల్యే లు సందేశాలిస్తున్నారు.


ఇదివరకే పాలమూరులో ఈ వ్యవస్థకు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గత ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకుండా, వారి సమస్యలు పట్టించుకోకుండా తమ అభివృద్ధికే బాటలు వేసుకున్నారనే ఆరోపణలతో ప్రజలు ఇంటి బాట పట్టించారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సంస్కృతికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో కొత్త ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నం ప్రారంభించారు.

భూ దందాలు, అక్రమాలపై ఉక్కుపాదం

ఇప్పటికే గత పాలనలోని ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన భూ దందాలు, అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ప్రస్తుత ఎమ్మెల్యేలు వాటిపై దృష్టి పెట్టారు. మాజీలు చేసిన అక్రమాలు వెలికి తీస్తే కొత్త ఎమ్మెల్యేలపై ప్రజలకు నమ్మకం కుదురుతుంది. పాలమూరులో అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పట్టణ సమీపంలోని క్రిస్టియన్ పల్లి వద్ద 523 సర్వే నెంబర్ లో మాజీ మంత్రి అండతో అక్రమంగా నిర్మించిన 60 ఇళ్లను కూల్చి వేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ పర్యవేక్షణలో కూల్చివేతలు చేపట్టారు. ఇందులో చట్టపరంగా కొన్నవారు ఉంటే సరియైన డాక్యుమెంట్లు అధికారులకు అందజేయాలని ఎమ్మెల్యే ఎన్నం సూచించారు.


అర్హులైన వారికి అన్యాయం జరగనివ్వమని, అక్రమ కట్టడాలు కూల్చి వేసే కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాలమూరు పట్టణంలో అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. వాటిపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకునే ఆదేశాలిచ్చామని ఎమ్మెల్యే అంటున్నారు. కబ్జాదారుల చెర నుంచి భూములను విడిపించి ప్రభుత్వానికి స్వాధీన పరుస్తామన్నారు. భూములను స్వాధీనం చేసుకోకుంటే ఉద్యమం చేస్తామని బీజేపీ నేతలు కొత్త ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పాలమూరులో చేపడుతున్న చర్యలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిచోటా అధికారుల్లో కదలిక

వనపర్తిలో కూడా అక్రమాలపై విచారణ చేపడుతామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ప్రకటించారు. ఆక్రమణలకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకుంటామని, వాటిని దేవస్థానాలకు అప్పగిస్తామని, కబ్జాదారులపై చర్యలు చేపడుతామని హెచ్చరించారు. మాజీ మంత్రి భూములపై కూడా విచారణ చేపట్టి, ప్రజలకు నిజానిజాలు తెలుపుతామని మేఘా రెడ్డి ప్రకటించారు. మక్తల్ నియోజకవర్గంలో జరిగిన పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న తరుణంలో వాటిపై విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. నారాయణ పేట నియోజకవర్గంలో ఇప్పటికే పలు పనులపై విచారణ చేపడుతామని అక్కడి ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక ప్రకటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దొంగచాటుగా ఫర్నీచర్, కొన్ని శాఖల పైళ్ళు ఇతర ప్రాంతాలకు తరలించడం చర్చనీయాంశమైంది.


ఎమ్మెల్యే తీసుకునే చర్యలకూ భయపడి మాజీ ఎమ్మెల్యే ఈ పని చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ముఖ్యంగా కరివేన జలాశయానికి తరలించిన ఒండ్రు మట్టిలో చాలా అక్రమాలు జరిగినట్లు, దీనిపై విచారణ ఉంటుందని ఆయన అంటున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలపై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇదివరకే హెచ్చరించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చేసిన అక్రమాలు, భూ దందాలపై చర్యలు తప్పవని ప్రస్తుత ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశమే తప్పా మాజీలపై కక్ష సాధింపు కాదని చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు తెరిచామని, ప్రజలు తమ సమస్యలు నేరుగా కలిసి చెప్పుకోవచ్చని ఎమ్మెల్యేలు ప్రకటించారు.

అధికారులపై చర్యలు తప్పవా?

కొన్నేళ్లుగా కుర్చీకి అతుక్కుపోయిన అధికారులకు స్థానచలం ఉంటుందనే విషయం తెలుస్తోంది. ఇంతకాలం నేతల అడుగులకు మడుగులొత్తిన అధికారులు రూ.కోట్లకు పండగలేత్తారనే ఆరోపణలు చాలాఉన్నాయి. రెవెన్యూలో పని చేసే చాలా మంది ఉద్యోగులు భారీ మొత్తంలో కూడబెట్టారనే ఆరోపణలున్నాయి. పాలమూరులో ఈ ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రెవెన్యూలో పని చేసే ఉద్యోగి మంత్రి అండదండలతో భూ దందాలు సాగించారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఉద్యోగికి అన్నీ తెలుసు.


ఈయన అండతోనే పాలమూరులో భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణలు నిండుగా ఉన్నాయి. వీరేకాక పోలీస్ శాఖలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అక్రమ కేసులు పెట్టడంలో వారు ఆరితేరారనే ఆరోపణలున్నాయి. ఈ శాఖను ప్రక్షాళన చేస్తే తప్పా పాలమూరులో శాంతిభద్రతలు నెలకొనే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో పోలీస్ శాఖ పనితీరు ఇలాగే ఉంది. ఇలాంటి పోలీస్ అధికారులపై చర్యలు లేకుంటే వ్యవస్థ మారదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పోలీస్ వ్యవస్థ మార్పునకు ప్రస్తుత ఎమ్మెల్యేలు స్పందించకుంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలో మార్పు ఉంటేనే కొత్త ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ, ప్రజాపాలన సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.