Deputy CM Bhatti | ఈశ్వరమ్మను పరామర్శించిన డిప్యూటీ సీఎం, మంత్రి జూపల్లి

నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లికి చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు

Reported by: Somu | తెలంగాణ‌ | Jun 24, 2024, 2:21 pm IST
Read Time: 4 mins
Deputy CM Bhatti | ఈశ్వరమ్మను పరామర్శించిన డిప్యూటీ సీఎం, మంత్రి జూపల్లి

మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే అంశం : భట్టి

విధాత, హైదరాబాద్ : నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లికి చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం నిమ్స్ హాస్పిటల్‌లో బాధితురాలు ఈశ్వరమ్మను, కుటుంబ సభ్యులను భట్టి మంత్రి జూపల్లితో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని, పూర్తి ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని వైద్య అధికారులను కోరారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు తలదించుకునే ఘటన ఇది అని పేర్కొన్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితురాలను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని, మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి సైతం తరలించారని వివరించారు.

ఘటన విషయాన్ని మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈశ్వరమ్మ తిరిగి పూర్తిగా ఆరోగ్యంతో కోలుకునే వరకు ఉచితంగా ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇల్లు లేని పక్షంలో ఇందిరమ్మ ఇల్లు, ఇద్దరు పిల్లలను ఆశ్రమ పాఠశాలలో వారు ఎంతవరకు చదువుకుంటాం అంటే అంతవరకు చదివిస్తామన్నారు. సాగుకు వ్యవసాయ భూమి కేటాయించడం వంటి అన్ని చర్యలు ప్రభుత్వపరంగా చేపడతామన్నారు. ఈశ్వరమ్మ ఘటనలో సమీప బంధువులైన బావ, అక్కతోబాటు బయట వారు ఒకరిద్దరు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. నిందితులను ఇప్పటికే రిమాండ్ కు తరలించారని, ఈ ఘటనలో పూర్తి సమాచారం సేకరించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించినట్టు తెలిపారు.