Deputy CM Bhatti | రైతుల అభిప్రాయ సేకరణలపై అసెంబ్లీలో చర్చ: డిప్యూటీ సీఎం భట్టి

క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి, వాటిపై అసెంబ్లీలో చర్చించాకనే పూర్తిస్థాయి మార్గదర్శకాలతో 'రైతుభరోసా' పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు

Deputy CM Bhatti | రైతుల అభిప్రాయ సేకరణలపై అసెంబ్లీలో చర్చ: డిప్యూటీ సీఎం భట్టి

అనంతరమే రైతు భరోసాపై నిర్ణయం
అదిలాబాద్‌లో అభిప్రాయ సేకరణ
హాజరైన మంత్రులు తుమ్మల, పొంగులేటి, సీతక్కలు
పెద్ద రైతులకు భరోసా అక్కరలేదన్న చిన్న, సన్నకారు రైతులు

విధాత, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి, వాటిపై అసెంబ్లీలో చర్చించాకనే పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైన రైతు భరోసా పథకాన్ని ప్రజాక్షేత్రంలో రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేసి తీరుతుందన్నారు. అన్ని జిల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించి ప్రజా క్షేత్రంలో అభిప్రాయాలు సేకరించి ఈ అసెంబ్లీలో నివేదిక పొందుపరుస్తామని అన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం అందించే రైతు భరోసా పేద బడుగు వర్గాల రైతులకు న్యాయం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. రైతు భరోసా సాయంపై ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదని, గ్రామం యూనిట్‌గా తీసుకోవాలని ఎక్కువ మంది రైతులు సూచిస్తున్నారని పేర్కొన్నారు. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

రైతులకు పంటల పెట్టుబడి సాయం కింద రైతుభరోసా ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు తమ ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతుభరోసా అమలుపై విధివిధానాల రూపకల్పన చేస్తామన్నారు. ఇందుకోసమే తమ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి.. ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అర్హులకే రైతుభరోసా: మంత్రి తుమ్మల

కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిజమైన రైతులకే రైతు భరోసా అందించేందుకు అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ఆలోచనల మేరకు అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు రైతుభరోసా అందిస్తామన్నారు.

నిజమైన రైతులను ఆదుకుంటాం: మంత్రి పొంగులేటి

క్యాబినెట్ సబ్ కమిటీ మరో సభ్యుడు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… నిజమైన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. మరో 8 ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

బడ్జెట్లో 20 శాతం నిధులు జిల్లాకు కేటాయించాలి: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో 80 శాతం రైతులు వర్షాధారంపైనే పంటలు సాగు చేసి నష్టపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు వరుసలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ అమలు చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ కోరారు. బడ్జెట్లో 20శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ.. అన్ని వర్గాల రైతులను ఆదుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకంతో చేరువయ్యారని, ఈ పథకంలో ఆంక్షలు విధించవద్దని కోరారు.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులకు విపత్తు సమయంలో పరిహారం అందించే ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, రైతుల ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. బడా పారిశ్రామికవేత్తలకు, మూడు పంటలు సాగు చేసే పెద్ద బస్సును రైతులకు పంట పెట్టుబడి సాయం అందించకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 10 ఎకరాలు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా అమలు చేయాలని కోరారు.

10ఎకరాల వరకే ఇవ్వాలి

రైతు భరోసా బడా రైతులకు వద్దని, 10 ఎకరాల పరిమితి విధించండని పలువురు రైతులు ఈ సమావేశంలో సూచించారు. ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం రాష్ట్ర ఆర్థిక భారం దృష్ట్యా పెద్ద రైతులకు పక్కనపెట్టి పేద, దళిత గిరిజన రైతులకు అందించాలని పలువురు రైతులు కోరారు. మెస్రం జంగు అనే గిరిజన రైతు మాట్లాడుతూ.. వర్షాధారంపైనే తాము పంట సాగు చేస్తున్నామని. ఖర్చులు పోను ఏమీ మిగలడం లేదన్నారు. కౌలు రైతులకు కూడా సగం వంతు, మిగిలిన సగం ఆర్థిక సాయం పట్టా రైతులకు అందించాలని కోరారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సర్కారు పంటల సాయం నిలుపుదల చేయాలని, రియల్ ఎస్టేట్ భూములు, సాగుకు పనికిరాని బీడు భూములకు కూడా పంటల పెట్టుబడి సాయాన్ని ఆపివేయాలని ప్రకాష్, గుణవంతు అనే రైతులు కోరారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ఎంపీ గొడెం నగేష్ శాసనసభ్యులు అనిల్ జాదవ్, రామారావ్ పటేల్, హరీష్ రావు, వెడ్మా బొజ్జు, పెద్దపల్లి ఎంపీ వంశీ, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.