Amrapali | ఆమ్రపాలి ఆదేశాలు బేఖాతర్..!
Amrapali | జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి గత నెలలో థియేటర్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లను పార్కింగ్ ఫీజు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ ఆదేశాలను థియేటర్లు బుట్టదాఖలు చేస్తున్నాయి.

Amrapali | గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ (GHMC) ఆమ్రపాలి ఐఏఎస్(Amrapali IAS) గత నెలలో ఒక కీలక ఆదేశం జారీ చేసారు. థియేటర్లు, మాల్స్, షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ ఫీజు(No Parking Fees) వసూలు చేయవద్దని ఆ ఆదేశాల ముఖ్యాంశం. కానీ, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు ఏ థియేటరూ పాటించడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై గత రాత్రి(11 జూన్ 2024) ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్(Sandhya Theatre)లో ప్రేక్షకులకు, పార్కింగ్ నిర్వాహకుల(Parking Staff)కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సంధ్య థియేటర్లోని పార్కింగ్ నిర్వాహకులతో ప్రేక్షకులు ఫీజు వసూలు విషయమై, కమిషనర్ ఆదేశాల(GHMC Commissioner Orders) గురించి ప్రస్తావించగా, అటువంటి ఆదేశాలేవీ తమకు లేవని, ఫీజు ఇవ్వాల్సిందేనని వారు సినిమాకు వచ్చినవారితో దురుసుగా ప్రవర్తించగా, వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిజానికి కమిషనర్ జారీ చేసిన ఆదేశాలలో స్పష్టంగా చెప్పినదానిప్రకారం, థియేటర్‌కు, మల్టిప్లెక్స్‌కు సినిమా చూడటానికి వచ్చినవారి దగ్గర, షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపింగ్ చేసిన వారి దగ్గర ఎటువంటి పార్కింగ్ ఫీజలు తీసుకోకూడదని ఉంది. వీటిని చెందనివారు కూడా ఒక అర్థగంట( 30 minutes Free) పాటు పార్కింగ్ చేసుకోవచ్చని, ఆ తరువాతే ఫీజులు తీసుకోవాలని కూడా చెప్పారు.
Also Read: https://vidhaatha.com/telangana/amrapali-opposes-parking-fees-at-shopping-malls-and-theatres-92492
సంధ్య థియేటర్లోని పార్కింగ్ నిర్వాహకులు , ఒక పిల్లర్‌కు అతికించిన జిహెచ్ఎంసీ సర్క్యులర్ (GO MS No.121, dated 20/7/2021) ఒకదానిని చూపుతూ, దీని ప్రకారమే తాము పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నామని చెప్పగా, ప్రేక్షకులు దానిని పరిశీలించారు. కాగా, అది 3 సంవత్సరాల క్రితం అప్పటి జిహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న అరవింద్ కుమార్(Arvind Kumar IAS) జారీ చేసిన జిఓ ఎంఎస్ నెం.121, తేదీ 20/07/2021. అందులో ఉన్నదేంటంటే, బయట వేరే పనుల కోసం వచ్చినవారు(Non-Cinegoers) కూడా థియేటర్లో పార్కింగ్ చేసి వెళ్లిపోవడం వల్ల, థియేటర్ వారి పార్కింగ్ ప్రాంతం దుర్వినియోగం అవుతోందని, సినిమాకు వచ్చినవారికి పార్కింగ్ ప్లేస్ దొరకడం లేదని, వాటి భద్రత(Safety of the Vehicles) తమకు ఇబ్బందిగా మారిందని ఆరోపించిన థియేటర్ యాజమాన్యాల వాదనతో ఏకీభవిస్తూ, పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకోవచ్చని అప్పటి ఆ ఆదేశం అది. ఆ కాపీ ఫోటోను ఇక్కడ చూడవచ్చు.
అప్పటి ఆ జీఓను చూపుతూ, ఇప్పుడు కూడా థియేటర్ యజమానులు పార్కింగ్ ఫీజును యధేచ్చగా వసూలు చేస్తున్నారు. మరి జిహెచ్ఎంసీ క్షేత్ర సిబ్బంది ఏం తనిఖీలు చేస్తున్నారో గౌరవనీయులైన కమిషనర్ గారికే ఎరుక. ఆ మాటకొస్తే, అసలు ఆమ్రపాలి ఆదేశాలపై జీఓ విడుదలైందో లేదో కూడా తెలియదు.