Dharani
విధాత, హైదరాబాద్ ప్రతినిధి : తోబుట్టువుల మధ్య ధరణి చిచ్చు పెడుతున్నది. ధరణిలో లోపాలను ఉపయోగించుకుని.. తమ్ముళ్లనే మోసం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నది. వృద్దులైన తల్లితండ్రులకు మాయమాటలు చెప్పి, తోబుట్టువులకు తెలియకుండా కొందరు ప్రబుద్ధులు భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
ఇలాంటి సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
బెందరం బాపురెడ్డి, రాజవ్వ దంపతులకు 18.20 ఎకరాల భూమి ఉంది. వీళ్ల పెద్ద కుమారుడు వెంకట కృష్ణారెడ్డి తన తల్లిదండ్రులను బ్యాంకుకు తీసుకెళ్తున్నానని చెప్పి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకుపోయాడు. తల్లి పేరు మీద ఉన్న 3.20 ఎకరాలు, తండ్రి పేరు మీద ఉన్న 15 ఎకరాల్లో నుండి 8.20 ఎకరాలకు తన పేరిట రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయించుకున్నాడు.
ఈ విషయం తమ్ముడు వెంకట నరసింహారెడ్డి, సోదరి మళ్లీశ్వరికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇటీవల బాపురెడ్డి చనిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాజవ్వ.. తన భూమిని ఒకే కొడుకు తీసుకున్నాడని, తనకు విషయం చెప్పకుండా తహసీల్దార్ ఆఫీస్‌లో సంతకాలు పెట్టించుకున్నాడని, భూమి రిజిస్ట్రేషన్ అని తమకు చెప్పలేదని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది.
గతంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్‌కు, మ్యుటేషన్‌కు మధ్య కొంత సమయం ఉండేది. దాంతో అధికారులు క్లియర్‌గా చెక్ చేసేవాళ్లు. వారసులు ఎంతమంది ఉన్నారు? వారసత్వం ఎంతమందికి వర్తిస్తుంది? అని క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించేవాళ్లు. వారసులుంటే.. అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది.
పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేసే వాళ్లు కాదు. కుటుంబ సభ్యులందరికీ సంబంధం లేకుండా ఎవరైనా ఏకపక్షంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానిని అడ్డుకోవడానికి ఒక చెకింగ్ వ్యవస్థ అనేది ఉండేది. ధరణి వచ్చిన తర్వాత మ్యుటేషన్ దగ్గర ఇప్పుడు ఎలాంటి విచారణ వ్యవస్థ లేదు. ఇదే కొందరు తమ తమ్ముళ్లకు తెలియకుండా భూమిని రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నదని నిపుణులు అంటున్నారు.