Etala Rajender | సురక్షిత సమాజానికి దేశభక్తి..పర్యావరణం సాధనాలు : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
సురక్షితమైన మెరుగైన సమాజానికి దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ ముఖ్య సాధనాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

విధాత, హైదరాబాద్ : సురక్షితమైన మెరుగైన సమాజానికి దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ ముఖ్య సాధనాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ” ఏక్ పెడ్ మాకే నాం ” కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి కుటుంబం అమ్మ పేరిట ఒక మొక్కను నాటి సంరక్షించాలని కోరారు. కుటుంబాన్ని పోషించటంలో, మంచి చెడు చూడడంలో తల్లి పాత్ర ఎంత గొప్పదో… మానవాళిని కాపాడే వృక్షాల పాత్ర కూడా అంత గొప్పదన్నారు. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న అంశం గ్లోబల్ వార్మింగ్ అని, ప్రకృతి విధ్వంసం అయిపోతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతినిపోయి మనిషి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింా్నరు. 50డిగ్రీలకు ఎండ తీవ్రత పెరిగిపోతోందని, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జీవకోటికి రక్షణ ఇచ్చేది, తల్లిలాగా కాపాడేది చెట్టు అని గుర్తించి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అనేక రకాల రిఫార్మ్స్ తీసుకువచ్చారన్నారు. కంటోన్మెంట్లో వేలవేల ఎకరాల భూములు ఉంటాయని, ఇక్కడున్న ఖాళీ జాగాలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, దీన్ని గొప్పగా అందిపుచ్చుకొని కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. గత ప్రభుత్వం హరిత హారంలో మొక్కలు నాటినా లెక్కలు మాత్రం అభినందించేలా లేవన్నారు. అందుకే పచ్చదనం విస్తరణలో అందరూ స్వచ్చందంగా బాధ్యతగా ముందుకు రావాలన్నారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు హర్‌ఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమంలోఈటల రాజేందర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఐడీపీఎల్ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీని జండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తితో కూడిన పౌర సమాజం ఉన్న దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం గాజుల రామారంలో చాకొలేట్ ఫ్యాక్టరీనీ ఈటల ప్రారంభించారు.