Formula E-Car Race Case : ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం

ఫార్ములా ఈ-కారు కేసులో ఏసీబీ నివేదిక ప్రభుత్వానికి సమర్పితమైంది, కేటీఆర్ సహా నలుగురిపై చార్జిషీట్ అవకాశం ఉంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Sep 13, 2025, 5:30 pm IST
Read Time: 3 mins
Formula E-Car Race Case : ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం

విధాత : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ నివేదిక తాజాగా విజిలెన్స్ కమిషన్ కు చేరింది. రెండు రోజుల్లో నివేదికపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదికను అందించనున్నారు. ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి నివేదిక అందనుంది. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు ప్రమోటర్లు ఏ4, ఏ5 నిందితులుగా ఉన్నారు.

హెచ్‌‌ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54 కోట్ల 88 లక్షలను మంత్రివర్గం అనుమతి లేకుండానే..ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ…ఫెమా నిబంధనలను పాటించకుండా ఫార్ములా ఈ కారు రేసు సంస్థలకు నిధులు బదలాయించారని ఏసీబీ అభియోగాలు మోపింది. అప్పటికే కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యవహారం రూ.54.88 కోట్లకే ఆగిపోయిందని, లేదంటే రూ.600 కోట్ల స్కామ్​జరిగి ఉండేదని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే ఈ వ్యవహారంలో క్విడ్ ఫ్రోకో రూపంలో ఈ కారు రేసు సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల విరాళం అందిందని ఏసీబీ విచారణలో వెల్లడైంది.

ఫార్ములా ఈ-కారు రేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌, బీఎల్ఎన్ రెడ్డిను మూడు సార్లు ఏసీబీ ప్రశ్నించింది. కేసు విచారణ నివేదికను ప్రభుత్వానికి ఏసీబీ సమర్పించింది. గవర్నర్ అనుమతి లభిస్తే వెంటనే చార్జిషీట్ దాఖలు చేసి.. కేటీఆర్‌ సహా మరో నలుగురి ప్రాసిక్యూషన్‌కి ఏసీబీ సిద్దమవుతుందని సమాచారం.