హ్యామ్ రోడ్లలో అవినీతిపై హరీశ్ రావుకు మంత్రి వెంకట్ రెడ్డి కౌంటర్

హ్యామ్ రోడ్ల పనులలో అవినీతి జరుగుతుందంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు చేసిన ఆరోపణలపై నల్లగొండ బహిరంగ సభా వేదిక నుంచి ఆర్ఆండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో కేసీఆర్ పాలనలో రేట్లు, ఇప్పటి రేట్లు చూసుకోని వారు మాట్లాడాలన్నారు. కాళేశ్వరం పంపులలో, ధరణిలలో అన్నింటి పదేళ్లలో దోచుకున్న హరీశ్ రావుకు పచ్చర్లకామెర్ల తరహాలో కాంగ్రెస్ పాలన కూడా అవినీతి పాలనగా కనిపిస్తుందని వెంకట్ రెడ్డి విమర్శించారు.

విధాత : హ్యామ్ రోడ్ల పనులలో అవినీతి జరుగుతుందంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు చేసిన ఆరోపణలపై నల్లగొండ బహిరంగ సభా వేదిక నుంచి ఆర్ఆండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రమాదాల నివారణకు మెరుగైన ప్రయాణ వసతులకు, పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం రూ.13వేల కోట్లతో హ్యామ్ రోడ్లను నిర్మిస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గుంతలు కూడా పూడ్చలేదన్నారు. మేం రోడ్లను అభివృద్ది చేస్తుంటే బావబామ్మర్దులు ఏడుపు మొదలుపెట్టి కాళ్లలో కట్టే పెడుతున్నారని కేటీఆర్, హరీశ్ రావులపై మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో కేసీఆర్ పాలనలో రేట్లు, ఇప్పటి రేట్లు చూసుకోని వారు మాట్లాడాలన్నారు.

కాళేశ్వరం పంపులలో, ధరణిలలో అన్నింటి పదేళ్లలో దోచుకున్న హరీశ్ రావుకు పచ్చర్లకామెర్ల తరహాలో కాంగ్రెస్ పాలన కూడా అవినీతి పాలనగా కనిపిస్తుందని వెంకట్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అంటే పేర్లు మార్చుకునే పార్టీ కాదని, నిన్న టీఆర్ఎస్, నేడు బీఆర్ఎస్, రేపు హరీశ్ రావు హెచ్ఆర్ఎస్ పార్టీగా మారనుందని సెటైర్లు వేశారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్ఆండ్ బీ శాఖ రూ.6,500కోట్లతో, పంచాయతీరాజ్ శాఖ 7వేలకోట్లతో, హ్యామ్ రోడ్లతో 13వేలకోట్లతో రోడ్ల అభివృద్ది జరుగుతుందన్నారు. అదే విధంగా జాతీయ రహదారుల నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ వరకు హైవే, బెంగుళూరుకు గ్రీన్ ఫీల్డ్ హైవే సహా రూ.78వేల కోట్ల రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు.

కేసీఆర్ నల్లగొండ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2014ఎన్నికల్లో కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పి పదేళ్లలో పట్టించుకోలేదన్నారు. మేం వెంటపడి విదేశాల నుంచి టీబీఎం బేరింగ్ మిషన్ తెప్పించి పనులు జరిపిస్తుంటే బీఆర్ఎస్ దొంగల నజర్ పటి టన్నెల్ కూలిపోయిందన్నారు. 2028ఆగస్టు నాటికి ఎస్ ఎల్బీసీ పనులను పూర్తి చేయించి నాలుగు లక్షల ఎకరాలను సాగుతాగునీరు అందిస్తాం అన్నారు. ఫ్లోరైడ్ పీడిత జిల్లా వాసులకు మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామని , లేకుంటే ఓట్లు అడగమని చెప్పి సిగ్గులేకుండా మళ్లీ ఓట్లు అడిగారని విమర్శించారు. మూసీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఉమ్మడి నల్లగొండ వాసులకు మూసీ ప్రక్షాళనతో మేలు జరుగుతుందని, బీఆర్ఎస్ వాళ్లు మూసీ ప్రక్షాళనకు కూడా అడ్డుపడుతున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు.

నల్లగొండ నియోజకవర్గానికి ఉమ్మడి రాష్ట్రంలో నేను తెలంగాణ కోసం కోట్లాడినందుకు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి ఇవ్వలేదని, కేసీఆర్ నా పదవి పికేయించాడని..మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రెండేళ్ల నుంచి నిధులు అందుతున్నాయని వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. నల్లగొండ కార్పోరేషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తికి రూ.300కోట్ల నిధులు, మైనార్టీ షాదీఖానాకు రూ.20కోట్లు మంజూరీ చేయాలని కోరారు.  ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్ కు రూ.450కోట్ల రేవంత్ రెడ్డి, ఉత్తమ్ లు ఇచ్చారని, అయితే మరో రూ.500కోట్లు మంజూరీ చేస్తే లైనింగ్ పూర్తవుతుందని నిధులు మంజూరీ చేయాలని కోరారు. గత ఎన్నికల్లో 11ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించిందని, వచ్చే ఎన్నికల్లో సైతం అన్ని స్థానాలలో గెలిపించి మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తామని, అడిగిన నిధులు సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాలని కోరారు.

వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డు: మంత్రి ఉత్తమ్

వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోలు చేసిందని, ఖరీఫ్, యాసంగిలో 152లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ.39వేల కోట్లను రైతులకు చెల్లించిందని, యాసంగిలో 81లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసి రూ.19,313కోట్లు రైతులకు చెల్లించిన ప్రభుత్వం దేశంలోనే మన రాష్ట్రం ఒక్కటేనని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటిదాక కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.79,886కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు. వరి పండించడంలో, కొనుగోలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. యాసంగిలో 13లక్షల మంది రైతుల ధాన్యం కొనుగోలు చేసిందని, ధాన్యం పండించడంలో రాష్ట్రంలో నల్లగొండ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. యాసంగి పంటకు రూ.1,827కోట్లను జిల్లా రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలను మరుగుపరిచే కుట్రతో ధాన్యం కొనుగోలుపై దుష్ప్రచారం చేశాయని ఉత్తమ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 3కోట్ల 41లక్షల మందికి ఉచిత సన్న బియ్యం అందిస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల అందించామన్నారు.

ఇరిగేషన్ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ముందుకెలుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, జిల్లాలోని ఎత్తిపోతల పథకాలతో పాటు నాగార్జున సాగర్ ఆధునీకరణ, బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లు, ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్,  బునాదిగాని కాలువ పనులన్నింటిని సీఎం సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ రఘువీర్ రెడ్డి ప్రసగించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Latest News